Menu

  • Home
  • తెలంగాణ
  • ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప‌వ‌ర్ ఫుల్ స్పీచ్
cm revanth reddy osmania university

ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప‌వ‌ర్ ఫుల్ స్పీచ్

ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు. తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపిన ఉస్మానియా యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని, ఈ మేరకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నూతనంగా 90 కోట్ల‌తో నిర్మించిన దుందుభి, భీమ హాస్టళ్ళ ప్రారంభోత్సవం సందర్భంగా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో తెలంగాణ, ఉస్మానియా యూనివర్సిటీల మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘తెలంగాణ అనే పదానికి ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ, ఇవి రెండూ అవిభక్త కవలల్లాంటివి’ అని ఆయన అన్నారు. 1938 సాయుధ రైతాంగ పోరాటం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ఈ గడ్డ అందించిన స్ఫూర్తిని ఆయన కొనియాడారు. దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన శివరాజ్ పాటిల్, పీవీ నర్సింహారావు, ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి లాంటి ఎందరో మేధావులను అందించిన ఘనత ఈ యూనివర్సిటీదేనని తెలిపారు. చదువుతో పాటు పోరాటాన్ని కూడా నేర్పించిన గడ్డ ఉస్మానియా అని, రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం చేతులెత్తేసినప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిందని ఆయన చెప్పారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారిది ఈ యూనివర్సిటీనే అని గుర్తు చేసుకున్నారు.

cm revanth redddy osmania univesity visit

గత పదేళ్ల పాలనలో ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేసే కుట్ర జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి చైతన్యాన్ని అందించే మేధావులు ఈ యూనివర్సిటీ నుంచి రావాలని ఆకాంక్షించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీలను నియమించామని, చదువుకుని, చైతన్యం ఉన్నవారినే ఈ పదవుల్లో నియమించామని ఆయన స్పష్టం చేశారు. యువతను డ్రగ్స్, గంజాయి లాంటి వ్యసనాల నుంచి బయటపడేలా చేయాలని సూచించారు. ‘నా దగ్గర పంచడానికి భూములు లేవు, ఖజానా లేదు, కానీ మీకు ఇవ్వగలిగింది విద్య ఒక్కటే’ అని ఆయన ఉద్వేగంగా చెప్పారు. చదువు మాత్రమే ఒక మనిషి తలరాతను మార్చగలదని, అది మాత్రమే మిమ్మల్ని ధనవంతులుగా, గుణవంతులుగా మార్చగలదని చెప్పారు. పేదరికం నుంచి వచ్చినవాళ్ళం కాబట్టి ఆ కష్టాలు తమకు తెలుసని, వాటిని పారద్రోలడం తమకు బాగా తెలుసు అని అన్నారు.

Also Read..| సురవరం సుధాకర్ రెడ్డి పేరు శాశ్వతంగా నిలిచేలా నిర్ణయం : సీఎం

ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఒక ఇంజనీర్స్ కమిటీని వేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ యూనివర్సిటీని ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ ఫర్డ్, ఆక్స్ ఫర్డ్ స్థాయికి తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. యూనివర్సిటీ అభివృద్ధికి ఏం కావాలో అడిగి, అంచనాలను తయారు చేసి ఇవ్వమని కోరారు. త్వరలో మళ్ళీ వచ్చి, ఆర్ట్స్ కాలేజీ వద్ద సమావేశం ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేస్తానని ఆయన తెలిపారు. ఆ రోజు యూనివర్సిటీలో ఒక్క పోలీస్ కూడా కనిపించకుండా చూస్తానని, నిరసన తెలిపే వారికి అడ్డు చెప్పవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

cm revanth reddy speech at osmania university

కొంతమంది రాజకీయ నాయకులు పదవులు పోయాయన్న ఆవేదనతో ఉన్నారని, వారి ఉచ్చులో యువత పడవద్దని సీఎం సూచించారు. సమస్య ఉంటే తమ ప్రభుత్వానికి చెప్పాలని, మంత్రులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు. కోదండరాం ను కుట్ర చేసి పదవి నుంచి తొలగించారని, అది పైశాచిక ఆనందమని విమర్శించారు. మళ్లీ ఆయనకు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తామని హామీ ఇచ్చారు. వాట్సాప్, సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని, అబద్ధాలను నమ్మవద్దని ఆయన సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో సెంట్రల్ యూనివర్సిటీలో సింహాలు, ఏనుగులు ఉన్నాయని ప్రచారం చేసి అడ్డుకున్నారని, కానీ తెలంగాణలో మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయని తీవ్రంగా వ్యాఖ్యానించారు. అలాంటివారు తెలంగాణ సమాజానికి పట్టిన చెదలు లాంటివారని, వాళ్లు మళ్లీ వస్తే ఉస్మానియా యూనివర్సిటీని ఉండనివ్వరని అన్నారు. విశ్వ‌విద్యాల‌యంలో చదువుకునేందుకు ఏం కావాలో అడగండి, ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేసే బాధ్యత త‌న‌ద‌ని సీఎం రేవంత్ రెడ్డి భ‌రోసా ఇచ్చారు.

Share the post

Also Read..