ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy) మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నిరుపేదలకు, బహుజనులకు, సిద్ధాంతపరమైన రాజకీయాలను నమ్మిన ప్రతి ఒక్కరికీ ఇది తీరని లోటని ఆయన అన్నారు. మగ్దూం భవన్‌లో సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సురవరం సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ నేతలు డి. రాజా, కె. నారాయణ, కూనంనేని సాంబశివరావు, అజీజ్ పాషాలతో ఆయన మాట్లాడారు. విద్యార్థి దశ నుంచి జాతీయ రాజకీయాల వరకు సుధాకర రెడ్డి రాజీపడని నిబద్ధతతో పనిచేశారని ఆయన కొనియాడారు. ఏఐఎస్‌ఎఫ్ నుంచి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పటికీ ఆయనలో అహంకారం ఎన్నడూ కనిపించలేదని రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read..| ‘ఓట్ల చోరీ’ ఆరోపణలకు రాహుల్ గాంధీకి రాజ్ థాకరే మద్దతు !
పాలమూరు బిడ్డగా బూర్గుల రామకృష్ణ రావు, జైపాల్ రెడ్డి వంటి గొప్ప నేతల కోవలో సుధాకర్ రెడ్డి జిల్లాకు ఎంతో పేరు తెచ్చారని సీఎం గుర్తు చేసుకున్నారు. సురవరం ప్రతాప రెడ్డి పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టాలంటూ సుధాకర్ రెడ్డి లేఖ పంపించినప్పుడు, తాము వెంటనే ఆ సూచనను అమలు చేసి ఆయన పేరు పెట్టామని చెప్పారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డిని వ్యక్తిగతంగా కలుస్తానని చెప్పినా, ఆ అవకాశం దక్కలేదని, ఇప్పుడు ఈ విధంగా కలుసుకోవాల్సి వస్తుందని ఊహించలేదని ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు.

అధికారంలో ఉన్నా లేకున్నా, ప్రజాప్రతినిధిగా ఉన్నా లేకున్నా సుధాకర్ రెడ్డి ఎన్నడూ తన సిద్ధాంతాన్ని వదల్లేదని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ సమావేశంలోనూ ఆయన సేవలను స్మరించుకుని నివాళులర్పించామని, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా సంతాప సందేశం పంపించారని తెలిపారు. సురవరం కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విలువలతో కూడిన సిద్ధాంత నిబద్ధత కలిగిన నాయకుల పట్ల ప్రభుత్వానికి గౌరవం ఉందని, అందుకే కొండా లక్ష్మణ్ బాపూజీ, చాకలి ఐలమ్మ, జైపాల్ రెడ్డి, గద్దర్ వంటి మహనీయుల గౌరవార్థం సంస్థలకు వారి పేర్లు పెట్టామని అన్నారు. సురవరం సుధాకర్ రెడ్డిని కూడా చిరస్థాయిగా గుర్తుంచుకునేలా క్యాబినెట్‌లో చర్చించి సముచితమైన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు.









