ఆంద్రప్రదేశ్ లో కలిపిన ఆ 5 గ్రామాలను తెలంగాణలో కలపాలి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎదురవుతున్న ముంపు సమస్యపై తెలంగాణ జాగృతి సంస్థ గురువారం హైదరాబాద్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన కొన్ని గ్రామాలను తిరిగి తెలంగాణకు అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు.
5 గ్రామాలను తెలంగాణలో కలపాలి
కవిత తన ప్రసంగంలో, ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయబడిన పురుషోత్తపట్నం, గుండాల, ఎట్టపాక, కన్నాయగూడెం, పిచ్చుకలపాక గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు ‘ప్రగతి ఎజెండా’ పేరిట నిర్వహించనున్న సమావేశంలో ఈ అంశాన్ని చర్చించాలని ఆమె సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఈ ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు తీసుకొచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కవిత కోరారు. కరకట్టల ఎత్తు పెంచుకుంటేనే భవిష్యత్తులో ఈ గ్రామాలకు రక్షణ ఉంటుందని, లేదంటే ఏ ఒక్క ఏడాది భారీ వరదలు వచ్చినా అన్ని గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

భద్రాచలం ముంపు, దేవుడి మాన్యంపై ఆందోళన
పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం ప్రాంతానికి శాశ్వత ముంపు ఏర్పడిందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన పురుషోత్తపట్నంలో భద్రాచలం రాముడి మాన్యం వెయ్యి ఎకరాలు ఉందని, ఆ భూములు ఆంధ్రాకు వెళ్లిపోగా, దేవుడు మాత్రం తెలంగాణలో ఉన్నారని పేర్కొన్నారు. అక్కడ పట్టించుకునే పరిస్థితి లేక దేవుడి మాన్యం అన్యాక్రాంతమవుతోందని, ఈ దేవుడి మాన్యాన్ని పరిరక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

5 గ్రామాలను తెలంగాణలో కలపాలి.. లేదంటే న్యాయ పోరాటానికి సిద్ధం
పోలవరం ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించాలని కవిత డిమాండ్ చేశారు. అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నంలో తెలంగాణ జాగృతి సుప్రీం కోర్టును ఆశ్రయించిందని గుర్తు చేశారు. 2014లో ప్రధాని మోదీ మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఏడు మండలాలను ఏపీలో కలపడానికి ఆర్డినెన్స్‌ను ఆమోదించి అన్యాయం చేశారని కవిత ఆరోపించారు.

Also Read… Sai Pallavi: ‘కుబేర’ పై సాయి పల్లవి ప్రశంసల జల్లు
ఏడు మండలాలను అన్యాయంగా ఏపీలో కలపడమే కాకుండా, లోయర్ సీలేరు విద్యుత్తు ప్రాజెక్టును కూడా ఏపీకి అప్పజెప్పారని కవిత అన్నారు. బ్యాక్ డోర్ రాజకీయాలు చేసి చంద్రబాబు ఈ ఏడు మండలాలను తీసుకున్నారని కవిత ఆరోపించారు. ఇది విభజన చట్టానికి, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని అప్పుడే పార్లమెంటులో తాము గళమెత్తామని కవిత గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యులు పార్లమెంటులో మాట్లాడినా, కాంగ్రెస్ సభ్యులు మాత్రం ఆనాడు పట్టనట్టు వ్యవహరించారని అన్నారు. కేసీఆర్ బంద్‌కు పిలుపునిచ్చినా కేంద్రానికి చీమకుట్టినట్టుగా కూడా లేదని కవిత అన్నారు. పోలవరం స్పిల్ వే సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్కులకు పెంచుకోవడం వల్ల తెలంగాణకు బ్యాక్‌వాటర్ సమస్య ఏర్పడుతుందని, దీని వల్ల భద్రాచలం రామాలయం మునిగిపోయే ప్రమాదంలో ఉందని ఆమె తెలిపారు.
