తెలంగాణ భారతీయ జనతా పార్టీలో అధ్యక్ష పదవి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి పార్టీ కార్యాలయానికి వచ్చారు. అయితే, నామినేషన్ పత్రాలపై ఆయనకు మద్దతుగా 10 మంది క్రియాశీల నాయకులు సంతకం చేయాల్సి ఉండగా, ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన రాజాసింగ్ బీజేపీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు.
ఎమ్యెల్యే రాజాసింగ్ తీవ్ర ఆరోపణలు
పార్టీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన రాజాసింగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. “నేను నామినేషన్ వేయడానికి వచ్చాను, ఫామ్ కూడా తీసుకున్నాను. కానీ, నామినేషన్ వేయాలంటే పది మంది కౌన్సిల్ సభ్యులు మద్దతు ఇవ్వాలి. నామినేషన్ వేయకుండా ఉండేందుకు స్టేట్ కౌన్సిల్ సభ్యులకు ఫోన్లు చేసి బెదిరించారు. వాళ్ళను పార్టీలో ఉంటారా లేక సస్పెండ్ అవుతారా అని భయపెట్టారు” అని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read.. | పాశమైలారంలో ఫైర్ యాక్సిడెంట్.. 10 మంది మృతి !
కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలోనే తాను పార్టీలో చేరానని గుర్తుచేసిన రాజాసింగ్, కిషన్ రెడ్డికే తన రాజీనామా లేఖను అందజేసినట్లు తెలిపారు. అంతేకాకుండా, తన ఎమ్మెల్యే పదవికి కూడా సస్పెండ్ చేయమని స్పీకర్‌కు లేఖ రాయాలని కిషన్ రెడ్డిని కోరారు. “2014 నుంచి పార్టీలో అనేక ఇబ్బందులు పడి వచ్చాను. నేను టెర్రరిస్ట్‌ల టార్గెట్‌గా ఉన్నాను. నా కుటుంబ సభ్యులు కూడా టార్గెట్‌లో ఉన్నారు” అని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
“మీ పార్టీకి దండం, మీకో దండం”.. : ఎమ్యెల్యే రాజాసింగ్
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని తాను ఆశించానని, అయితే పార్టీలోని అంతర్గత విభేదాలు, నాయకత్వం వ్యవహరించిన తీరు తనను తీవ్రంగా నిరాశపరిచాయని రాజాసింగ్ అన్నారు. “మీ పార్టీకి దండం, మీకో దండం” అని లెటర్ రాసి కిషన్ రెడ్డికి ఇచ్చి వచ్చానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

