సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక రియాక్టర్ పేలడంతో సుమారు 10 మంది కార్మికులు మరణించినట్లు తెలుస్తోంది, అలాగే 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
Also Read…| పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి
క్షతగాత్రులను వెంటనే చందానగర్, హుస్నాపూర్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ షెడ్డు పూర్తిగా కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు కృషి చేస్తున్నాయి. అయితే, రియాక్టర్ పేలుడు వల్ల వెలువడుతున్న తీవ్రమైన వాసన కారణంగా ఫ్యాక్టరీ లోపలికి వెళ్లడానికి ఎవరూ సాహసించడం లేదు. ఈ ఘటనతో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. అగ్నిమాపక సిబ్బంది, ఇతర సహాయక బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.