తెలంగాణలో రైతు భరోసా పథకం కింద ఐదు రోజుల్లోనే 7310.59 కోట్ల నిధులు విడుదలైతే భారత రాష్ట్ర సమితి (BRS) నాయకులు అనవసరమైన రాజకీయ నాటకాలు మొదలుపెట్టారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల సాగులో ఉన్న భూములకు రైతు భరోసా నిధులు విడుదల చేయడంలో జరిగిన జాప్యాన్ని రాజకీయ లబ్ధి కోసం BRS నాయకులు వాడుకుంటున్నారని మంత్రి ఆరోపించారు.
రైతు భరోసాపై బీఆర్ఎస్ అనవసర రాద్దాంతం
ప్రజలు తిరస్కరించిన “కోతల ప్రభుత్వం” BRS అని మంత్రి తుమ్మల వ్యాఖ్యానించారు. రైతుల తరపున తామే పేటెంట్లు తీసుకున్నట్లు నటిస్తున్న BRS నాయకులు, తమ పదవీకాలంలో అమలు చేసిన రుణమాఫీని గుర్తు చేసుకుంటే రైతుల ముందుకు రావడానికి కూడా మొహం చెల్లదని మంత్రి ఎద్దేవా చేశారు. BRS నాయకులు తమ హయాంలో రైతుబంధు నిధులను ఎన్ని నెలల పాటు విడుదల చేశారో ఒక్కసారి తిరిగి చూసుకోవాలని మంత్రి తుమ్మల సూచించారు. పంట పండే ప్రతీ గుంటకు భరోసా చెల్లించే బాధ్యత తమది అని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, రైతులకు అండగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.
Also Read..| ఆ 5 గ్రామాలను తెలంగాణలో కలపాలి: ఎమ్మెల్సీ కవిత