తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహా నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును ఎవరైనా అడ్డుకుంటే పురుగుల పడి చచ్చిపోతారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. మూసీ పునరుజ్జీవం పూర్తయితే హైదరాబాద్ నగరంలో పర్యావరణం మెరుగు అవుతుందని, సిటీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలో పర్యటకం భారీ స్థాయిలో డెవలప్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. పెట్టుబడులను ఆకర్షిస్తుందని గుర్తు చేశారు.
మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును అడ్డుకునే కుట్ర
కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతలు మాత్రం పునరుజ్జీవనంను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పెయిడ్ సోషల్ మీడియా ఛానెళ్ళలతో కిరాయి రాతలు రాయిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పద్దతి సరికాదని ఆమె సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా… ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవ ఉత్సవాలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈనెల 19న వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనుండగా, సీఎం రేవంత్ రెడ్డి దానికి హాజర కానున్నారు. నుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేస్తున్న ఈ సభావేదికకు ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా పేరు పెట్టారు. ఈ సందర్భంగా శనివారం మంత్రి సీతక్కతో మంత్రి కొండా సురేఖ సభా ఏర్పాట్లును పరిశీలించారు. ఇది మహిళలకు సంబంధించిన ప్రగతి నివేదన సభ అని పేర్కొన్నారు.
Also Read..| ఆందోల్ – జోగిపేటలో ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాలు
కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి అన్నారు. సభా వేదికపై నుంచి సీఎం రేవంత్ రెడ్డి 22 జిల్లాల్లో ఇందిరా మహిళా భవన్ లకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ ను ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తామని సీఎం మాటిచ్చారని, అందుకు అనుగుణంగా పనులు చురుగ్గా జరుగుతున్నాయని వెల్లడించారు. గిరిజనులు, షెడ్యూల్ క్యాస్టు ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసేది… చూసింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ఇందిరా గాంధీ హయాం నుంచి నిమ్నవర్గాల కోసం కాంగ్రెస్ పని చేస్తుందన్నారు. ల్యాండ్ సీలింగ్ యాక్టు తీసుకొచ్చి అర్హులైన నిరుపేద ఎస్సీ, ఎస్టీలకు భూములు ఇచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేసిందన్నారు. పక్కా ఇండ్లు కట్టించిందని, రాజభరణాలను రద్దు చేసి పేదల పక్షాన నిలిచిందన్నారు. కానీ, గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మాత్రం దళితులు, గిరిజనులు విపరీతమైన ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వారిని తీవ్రంగా వేధించిందని తెలిపారు. బాలింతలను కూడా విడిచిపెట్టకుండా కొట్టిన పాపం బీఆర్ఎస్ దేనని అన్నారు. కల్వకుంట్ల కుటుంబం దగ్గర ఉన్నన్ని డబ్బులు ప్రపంచంలో ఎవరి దగ్గర లేవని… గత పదేండ్లలో విపరీతంగా దోచుకొని సంపాదించారని అన్నారు. అధికారం పోయిన పిచ్చిలో ఏది పడితే అది కేటీఆర్ చేస్తున్నారని అన్నారు.
లగచర్ల ఘటన వెనక కేటీఆర్ హస్తం..
లగచర్ల ఘటనలో కలెక్టర్‌పై దాడి ఘటన మాజీ మంత్రి కేటీఆర్ పనే అని ఆమె ఆరోపించారు. కేటీఆర్ వెనక ఉండే దాడి చేయించారని విమర్శలు చేశారు. నిందితుడు ఎందుకు పోలీసులకు దొరకకుండా పోయాడని ఆమె ప్రశ్నించారు. పది సంవత్సరాలు నియంతల్లా పాలించి, ప్రస్తుతం అమాయకులను బలి చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను అప్పులపాలు చేసిందని అన్నారు. దుష్టపాలన అంతమొందించి ఏడాది పాలన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా లక్ష మంది మహిళలతో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్‌ది తుగ్లక్ పాలన అని ఎద్దేవా చేశారు. అరెస్టు చేస్తామన్న భయంతో ఎందుకు తన చుట్టూ దాదాపు 200 మందిని కేటీఆర్ పెట్టుకొని నిత్యం ఉంటున్నారని ప్రశ్నించారు.
సీఎం సభను విజయవంతం చేయండి
నవంబర్ 19న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాట్లను పరిశీలించిన ఆమె, ఈ సందర్భంగా మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను గడప గడపకు చేరేలా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేసే దిశగా పార్టీ కేడర్ సమన్వయంతో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేసి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని నేతలు, కార్యకర్తలకు మంత్రి సురేఖ కోరారు. ఆ రోజున కాళోజీ కళా క్షేత్రం ప్రారంభోత్సవంతో పాటు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో సీఎం పాల్గొననున్నట్లు మంత్రి తెలిపారు.