Wednesday, March 26, 2025
HomeNewsTelanganaKonda sureka: అటవీ సిబ్బందికి ప్రెసిడెన్షియల్ గ్యాలంట్రీ అవార్డులు!

Konda sureka: అటవీ సిబ్బందికి ప్రెసిడెన్షియల్ గ్యాలంట్రీ అవార్డులు!

దేశవ్యాప్తంగా అటవీ సిబ్బంది అందిస్తున్న నిరుపమానమైన సేవలను గుర్తిస్తూ వారికి ప్రతి యేడాది “ప్రెసిడెన్షియల్ గ్యాలంట్రీ అవార్డులు” అందించాలని కోరుతూ అటవీ, పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కు లేఖ రాశారు. ‘ఆల్ ఇండియా రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఫెడరేషన్’ విన్నపాన్ని తెలుపుతూ అటవీ అధికారులకు ఈ అవార్డును అందించాల్సిన అవసరాన్ని మంత్రి సురేఖ కేంద్రమంత్రికి వివరించారు. ఈ అవార్డుతో వారిలో నైతిక సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఇతర యూనిఫామ్ సర్వీసు ఉద్యోగులతో సమానంగా వారికి గుర్తింపు లభించినట్లవుతుందని మంత్రి సురేఖ కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ కు స్పష్టం చేశారు. అటవీ ఉద్యోగులకు ప్రెసిడెన్షియల్ గ్యాలంట్రీ అవార్డును అందించే దిశగా చర్యలు చేపట్టి, అడవులు, వన్యప్రాణుల సంరక్షణకై విలువైన సేవలు అందిస్తున్న వారిని ప్రోత్సహించాలని మంత్రి సురేఖ కోరారు.

అటవీశాఖ సిబ్బందికి అవార్డులను అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిపాదించిన మంత్రి కొండా సురేఖ

అటవీ అధికారులు భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలనే లక్ష్యంతో తమ జీవితాలను పణంగా పెట్టి అడవులు, వన్యప్రాణుల సంరక్షణను చేపడుతున్నారని మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి ప్రతిపాదించారు. “విధి నిర్వహణలో భాగంగా అటవీ సిబ్బంది ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటుంటారు. వన్యప్రాణులు, స్మగ్లర్ల నుంచి వీరి ప్రాణాలకు ముప్పు పొంచి వుంటుంది. అయినప్పటికీ వీరి త్యాగాలకు, సేవలకు గుర్తింపు లభించడం లేదు. పోలీసులతో పాటు ఇతర యూనిఫామ్ ఉద్యోగులకు వారి కృషికి తగిన గుర్తింపు లభిస్తున్నది. కానీ అడవుల్లో ఎన్నో ప్రమాదకరమైన సవాళ్ళు, ఒత్తిళ్ళతో పాటు స్మగ్లర్ల బెదిరింపులను తట్టుకుని విధులు నిర్వర్తిస్తున్న అటవీ అధికారులకు ఎలాంటి గుర్తింపు లభించడం లేదు. వీరి సేవలు కేవలం ప్రస్తుత కాలానికి మాత్రమే పరిమితమైనవి కావు భవిష్యత్ తరాల మనుగడకు వీరి సేవలు అవసరం. వీరి సేవలకు ప్రజల నుంచి ఎలాంటి గుర్తింపు గానీ, ప్రశంసలు గానీ లభించకపోవడం శోచనీయం. ఎలాంటి సౌకర్యాలు లేని అటవీ ప్రాంతాల్లో, సాయుధులైన ఆగంతకులను కేవలం పరిమిత రక్షణ పరికరాలతో, వారి ధైర్యసాహసాలతో మాత్రమే ఎదుర్కొంటున్నారు” అని మంత్రి సురేఖ ఇందులో పేర్కొన్నారు.

ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పోలీసులకు రాష్ట్రస్థాయిలో “పోలీస్ సేవా పతకాలు” అందిస్తున్నట్లుగానే “అటవీ సేవా పతకాలు” అందించాలని మంత్రి సురేఖ ముఖ్యమంత్రికి విన్నవించారు. అంతేకాకుండా అటవీ, వన్యప్రాణులు సంరక్షణలో ఉత్తమ సేవలందించే వారికి ఇంతకుపూర్వం అందించిన “వన సంరక్షణ సేవా పతకాలు” తిరిగి పునరుద్ధరించాలని మంత్రి కోరారు. వీటితో పాటు అడవులు సంరక్షణ, అభివృద్ధి కోసం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు “చీఫ్ మినిస్టర్ అవార్డు” ను అందజేయాలని కోరారు. అటవీ అధికారులకు గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవంతో పాటు ప్రతి సంవత్సరం జనవరి 1 వంటి ప్రత్యేక రోజుల్లో ప్రెసిడెన్షియల్ గ్యాలంట్రి అవార్డు, ఇందిర ప్రియదర్శిని వృక్షమిత్ర అవార్డు, ఇతర జాతీయ అవార్డులను అందించే దిశగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించాలని మంత్రి సురేఖ కోరారు. ఈ అవార్డులు వారిలో ఎంతో ఉత్సాహాన్ని నింపి, గొప్ప అంకితభావంతో విధి నిర్వహణ చేపట్టేలా ప్రోత్సహాన్నందిస్తాయని మంత్రి సురేఖ ముఖ్యమంత్రికి తెలిపారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments