ఆదివాసీ సాంప్రదాయాలకు అనుగుణంగా మేడారం ఆధునికీకరణ పనులు ఉంటాయిని మంత్రి సీతక్క తెలిపారు. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ ఆధునికీకరణ పనులపై మంత్రి సీతక్క ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగినట్లు మంత్రి తెలిపారు.
ఈ సమావేశానికి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యార్, కమిషనర్ వెంకట్రావు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, గిరిజన సాంస్కృతిక శాఖ అధికారులు, ఆలయ పూజారులు, నిపుణులు హాజరయ్యారు. ఆదివాసీ సంస్కృతి, సమ్మక్క సారలమ్మల తెగువ ఉట్టిపడేలా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. భక్తుల సౌకర్యార్థం, పూజారుల విజ్ఞప్తి మేరకు ఆలయ పరిసరాల్లో ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు. అయితే, అమ్మల ప్రధాన గద్దెల్లో ఎలాంటి మార్పులు చేయకుండా, కేవలం ఆలయ పరిసరాల్లో మాత్రమే ఈ పనులు చేపడతారు. పూజారుల విశ్రాంతి గదులు, అత్యవసర సేవలు, భద్రత, వైద్య సిబ్బంది, మీడియా కోసం అదనపు వసతులు కల్పించేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.

పూజారులు ఆలోచనలకు అనుగుణంగానే మేడారం ఆధునికీకరణ పనులు
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆదివాసీల సంప్రదాయాలను, పూజారుల ఆలోచనలకు అనుగుణంగా మేడారం ఆధునికీకరణ పనులు చేపడతామని స్పష్టం చేశారు. భక్తులకు సౌకర్యాలు కలిగించే విధంగా ఆలయ ప్రాంగణాన్ని ఆధునికీకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్‌లో ఉన్నందున ఈ సమావేశానికి రాలేకపోయారని, వారి సూచన మేరకు ఇది రాష్ట్రస్థాయిలో జరుగుతున్న రెండో సమావేశమని సీతక్క వెల్లడించారు.
వారంరోజుల్లో గద్దెల ఆధునికీకరణ పనుల మస్టర్ ప్లాన్
“ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను చాటే విధంగా, సమ్మక్క సారలమ్మ తల్లుల ధీరత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఆలయ ప్రాంగణాన్ని, పరిసరాలను తీర్చిదిద్దుతాం. సమ్మక్క సారలమ్మల ప్రధాన గద్దెల్లో ఎలాంటి మార్పులు చేయకుండా పరిసరాలను భక్తుల ఆకాంక్షలకు, పూజారుల ఆలోచనలకు అనుగుణంగా విశాలంగా తీర్చిదిద్దుతాం” అని మంత్రి పేర్కొన్నారు. పూజారుల ఆలోచనలకు అనుగుణంగానే మేడారం మాస్టర్ ప్లాన్ ఉంటుందని, వారం రోజుల్లో గద్దెల చుట్టూ ఆధునికీకరణ పనులకు సంబంధించిన ప్లాన్‌ను సిద్ధం చేస్తామని తెలిపారు. పూజారుల ఆమోదంతోనే పనులు ప్రారంభిస్తామని, పనుల ప్రతి దశలో వారి అభిప్రాయాలను తీసుకొని ముందుకు వెళ్తామని సీతక్క హామీ ఇచ్చారు.

వచ్చే జాతర లోపు చేయాల్సిన పనులను ముందస్తుగా చేపడతామని, భక్తులు పుణ్య స్నానాలు చేసే జంపన్న వాగు అభివృద్ధి కోసం ఇప్పటికే ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేశామని మంత్రి ప్రకటించారు. జంపన్న వాగు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర సేవలు, భద్రత, వైద్య సిబ్బంది, పూజారులు, భక్తులు, మీడియా ప్రతినిధులకు మరిన్ని వసతులు కల్పించే విధంగా ఆలయం చుట్టూ ఏర్పాట్లు చేస్తామని, మేడారంలో బస చేసే భక్తులకు ఎలాంటి లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. కుంభమేళాలో భక్తులకు వసతులు కల్పించిన ఏజెన్సీలను సంప్రదించి వారి సలహాలు కూడా తీసుకుంటామని మంత్రి వివరించారు









