కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత విషయంలో NDSA నివేదికపై కాంగ్రెస్, బీజేపీలు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నాయని, అవి నిరాధారమైనవని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కనీస శాస్త్రీయ పరీక్షలు, డేటా లేకుండానే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఇచ్చిన నివేదికను ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ తిరస్కరించడమే దీనికి నిదర్శనమన్నారు. బీఆర్‌ఎస్‌ను అప్రతిష్టపాలు చేసేందుకే కేంద్ర ప్రభుత్వ సంస్థ NDSA అశాస్త్రీయ నివేదికను ఇచ్చిందనేది మరోసారి స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు.
NDSA నివేదిక పేరుతో గతంలోనే కుట్రలు..
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌పై బురద జల్లేందుకు కాంగ్రెస్-బీజేపీలు కుట్రలు పన్నాయని, ఇటీవల బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను దెబ్బతీసేందుకు తుది నివేదిక పేరుతో కొత్త డ్రామాకు తెరతీశాయని కేటీఆర్ ఆరోపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ-దశల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
అది NDSA నివేదిక కాదు.. NDA నివేదిక..
మేడిగడ్డ బ్యారేజీపై NDSA నివేదిక అవాస్తవమని బీఆర్‌ఎస్ మొదటి నుంచీ చెబుతున్నదేనని, ఎల్ అండ్ టీ తాజా నిర్ణయంతో అది నిజమని రుజువైందని అన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతో, ఢిల్లీలోని కాంగ్రెస్, బీజేపీ కేంద్ర కార్యాలయాల్లో ఈ నివేదికను తయారు చేశారని ఆయన ఆరోపించారు. తాము NDSA నివేదికను NDA నివేదిక అని పిలవడంలో తప్పు లేదన్నారు.
NDSA నివేదికను ప్రామాణికంగా తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడటం వారి అసమర్థతకు, దివాలాకోరు విధానాలకు నిదర్శనమని విమర్శించారు. కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే అక్కసుతో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని పక్కనపెట్టి సీఎం రేవంత్ రెడ్డి క్షమించరాని పాపం చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి నిర్వాకంతో ఏడాదిన్నరగా రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి, 500 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండా ఇచ్చిన NDSA నివేదికను ఎల్ అండ్ టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని కేటీఆర్ అన్నారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయినా వేగంగా పునరుద్ధరించిన విషయాన్ని మరిచిపోయి, మేడిగడ్డ విషయంలో మాత్రం 18 నెలలుగా మొత్తం ప్రాజెక్టునే నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమన్నారు.
Also Read..| లోకల్ బాడీ ఎన్నికలు.. రిజర్వేషన్లు ఖరారు చేయనున్న బీసీ కమీషన్ !
ప్రాజెక్టు ప్రణాళికల నుంచి నిర్మాణం వరకు నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్మించిన కాళేశ్వరంపై బురద జల్లడం మానుకోవాలని, ఎల్ అండ్ టీ అభ్యంతరాలకు ప్రభుత్వం, NDSA సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. NDSA వాదనలన్నీ తప్పుల తడక అని తేలిపోయిన నేపథ్యంలో, దీన్ని సాకుగా చూపి దాటవేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకనైనా పోలవరం తరహాలో పునరుద్ధరణ చర్యలు చేపట్టి తెలంగాణ రైతుల సాగునీటి కష్టాలను తీర్చాలని సూచించారు. లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్-బీజేపీలు చేస్తున్న కుట్ర రాజకీయాలకు తెలంగాణ రైతులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఎవరు ఎన్ని కుట్ర సిద్ధాంతాలు సృష్టించినా, వాస్తవం మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనాడి అని, కేసీఆర్ దూరదృష్టి గల నాయకుడని ఆయన పునరుద్ఘాటించారు.