Wednesday, June 18, 2025
HomeNewsTelanganaలోక‌ల్ బాడీ ఎన్నిక‌లు.. రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు చేయ‌నున్న బీసీ క‌మీషన్ !

లోక‌ల్ బాడీ ఎన్నిక‌లు.. రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు చేయ‌నున్న బీసీ క‌మీషన్ !

తెలంగాణలో లోక‌ల్ బాడీ ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ప్రభుత్వం చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. ఈసారి, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్ల బాధ్యతను బీసీ డెడికేషన్ కమిషన్‌కు అప్పగించడం విశేషం. గతంలో ప్రభుత్వమే ఈ రిజర్వేషన్లను కేటాయించేది. బీసీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించాలని అన్ని పార్టీల నుంచి డిమాండ్లు రావడంతో, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బీసీ డెడికేషన్ కమిషన్ ఇప్పటికే రాష్ట్రంలోని బీసీ కులగణనను పూర్తి చేసి, జనాభా లెక్కలను ప్రభుత్వానికి అందజేసింది. 42 శాతం రిజర్వేషన్ల డిమాండ్ నేపథ్యంలో, కమిషన్ గ్రామాల్లోని సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల జాబితాను కూడా ప్రభుత్వానికి సమర్పించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల బాధ్యతను మాత్రం అధికారులకే అప్పగించారు.

ఎన్నిక‌ల ఏర్పాటుకు పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు ?

స్థానిక ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్ అధికారులకు ఇప్పటికే ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసిన‌ట్లు స‌మాచారం. ఓటరు జాబితా తయారీ, పంచాయతీల్లో వార్డుల విభజన, పోలింగ్ కేంద్రాల గుర్తింపు వంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఎన్నికలకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేశారు. రిటర్నింగ్ అధికారులు (ఆర్వోలు), పోలింగ్ అధికారులు (పీవోలు)కు శిక్షణ కూడా పూర్తయింది. వివిధ రాజకీయ పక్షాల నాయకులతో ఎన్నికల సంఘం ఇప్పటికే సమావేశం నిర్వహించింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత త్వరలోనే మరోసారి అధికారులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. జూన్ నెలాఖరు లేదా జూలై మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాలు.. ఎన్నికల లెక్కలు

తెలంగాణలో మొత్తం 12,848 గ్రామాలు ఉండగా, స్థానిక ఎన్నికల నిర్వహణకు అధికారులు గతంలో ఏర్పాట్లు చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ లోపు, మున్సిపాలిటీల విస్తరణలో భాగంగా 73 గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. దీంతో ఇప్పుడు 12,775 పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, గతంలో 570 ఎంపీపీ స్థానాలు ఉండగా, ప్రస్తుతం 567 మండలాలకు మాత్రమే ఎంపీపీలను ఎన్నుకోనున్నారు. ఎంపీపీ స్థానాల సంఖ్య ఎంత ఉంటుందో జడ్పీటీసీల స్థానాల సంఖ్య కూడా అంతే ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 32 జడ్పీ చైర్మన్ స్థానాలు ఉండగా, మేడ్చల్ జిల్లాలోని గ్రామాలన్నీ నగరంలో కలపడంతో ఒక జడ్పీ చైర్మన్ స్థానం తగ్గనుంది. దీంతో 31 జడ్పీ చైర్మన్లను మాత్రమే ఎన్నుకోనున్నారు. ప్రస్తుతం 1,12,680 వార్డులు, 5,307 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వార్డు రిజర్వేషన్ల బాధ్యతలను ఆర్డీఓ, ఎంపీడీఓలకు అప్పగించారు.

Also Read..| గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ.. RRR ప‌రిదిలో మూడు సిటీలు..?

విలీన గ్రామాల్లో లోక‌ల్ బాడీ ఎన్నికల సందిగ్ధత

రాష్ట్రంలో 73 గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేయడంతో ఈ గ్రామాలను స్థానిక సంస్థల ఎన్నికల పరిధి నుంచి తొలగించారు. ములుగు, కల్లూరు, బిచ్కుంద, అలియాబాద్, రామగుండం, పెద్ద అంబర్‌పేట, చేవెళ్ల, మొయినాబాద్, కొత్తగూడెం, అమీన్‌పూర్, మద్దూరుతో పాటు పలు మున్సిపాలిటీల్లో ఈ గ్రామాలు విలీనం అయ్యాయి. ఇవి ఇకపై మున్సిపల్ పరిధిలోకి వస్తాయి. అయితే ఈ గ్రామాల విలీనం వల్ల ఆయా మండలాల్లోని కొన్ని గ్రామాలు కొంత ప్రభావితమయ్యాయి. ఎంపీటీసీ ఎన్నికలకు ఇది కొంత అవరోధం కానుంది. ఈ ప్రాంతాల్లో ఎన్నికలను ఎలా నిర్వహించాలనే దానిపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఈ గ్రామాలను మినహాయించి ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై కసరత్తు చేస్తున్నారు.

మేడ్చల్ జిల్లాలో స్థానిక ఎన్నికల రద్దు ?

మేడ్చల్ జిల్లాలో మొత్తం 62 గ్రామాలు ఉండగా, గతంలో 28 గ్రామాలు పలు మున్సిపాలిటీల్లో విలీనం అయ్యాయి. తాజాగా మరో 32 గ్రామాలు నగరంలో విలీనం కావడంతో మేడ్చల్ జిల్లాను స్థానిక ఎన్నికల నుంచి తొలగించనున్నారు. అల్వాల్, బాచుపల్లి, బాలానగర్, దుండిగల్, ఘట్‌కేసర్, జీడిమెట్ల, కాప్రా, కీసర, కూకట్‌పల్లి, మల్కాజ్‌గిరి, మేడ్చల్, మేడిపల్లి, ముచ్చింతల్, కుత్బుల్లాపూర్, షామీర్‌పేట వంటి మండలాలు మేడ్చల్ జిల్లాలో ఉన్నాయి. వీటిలో కొన్ని అర్బన్ మండలాలు. ఐదు మండలాలకు ఎంపీపీలు, జడ్పీటీసీలు ఉండగా, ఇప్పుడు ఆ మండలాలను లోకల్ బాడీ ఎన్నికల నుంచి తొల‌గించార‌ని తెలుస్తోంది.

కొత్త ఓటరు జాబితా, నోటిఫికేషన్ కీలకం

స్థానిక ఎన్నికల నిర్వహణకు కొత్త ఓటరు జాబితా రూపొందించడం, వార్డుల విభజన, పోలింగ్ కేంద్రాలను గుర్తించడం వంటి ప్రక్రియలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత, రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలోనే అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇది స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments