తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా రైతుల సంక్షేమం, నీటి పంపకాలు, హామీల అమలు వంటి కీలక అంశాలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఈ వాదోపవాదాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య జరిగిన మీడియా సమావేశాలు ఆజ్యం పోశాయి. రానున్న
రాగల 72 గంటల్లో..
రైతులకు ఎవరు ఏం చేశారో చర్చించడానికి సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన ఛాలెంజ్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, రేవంత్ రెడ్డికి “బేసిక్ నాలెడ్జ్ లేదని”, ఆయన పరువు తీసుకోకుండా ఉండేందుకు 72 గంటల ప్రిపరేషన్ టైం ఇస్తున్నానని ఎద్దేవా చేశారు. చర్చకు స్థలం, తేదీ, సమయం రేవంత్ రెడ్డియే నిర్ణయించాలని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్ “రైతు రాజ్యం” తెచ్చారని, కాంగ్రెస్ “రాబందుల రాజ్యం” నడుపుతోందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. రైతుల పేరుతో రంకెలు వేసిన రేవంత్ రెడ్డి ముచ్చట తీర్చడానికి తాను సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ పేర్కొన్నారు.

చంద్రబాబు కోవర్టు రేవంత్ రెడ్డి: కేటీఆర్
కేటీఆర్ తన విమర్శలను మరింత తీవ్రతరం చేస్తూ, రేవంత్ రెడ్డిని చంద్రబాబు కోవర్టుగా అభివర్ణించారు. “చంద్రబాబు కోవర్డులాగా పనిచేస్తూ తెలంగాణ నీళ్లను ఏపీకి రేవంత్ రెడ్డి దోచిపెడుతున్నాడు. గురువు కోసం ఏపీకి తెలంగాణ నీళ్లను పారిస్తున్న రేవంత్ రెడ్డి ముమ్మాటికీ కోవర్డే” అని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలన తెలంగాణలో కాకుండా, చంద్రబాబు పాలన నడుస్తుందని కేటీఆర్ ధ్వజమెత్తారు. నల్లమల పులి అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి నల్లమల తెలంగాణలో ఉందో లేదో కూడా తెలియదని, బేసిక్ నాలెడ్జ్ లేని రేవంత్ రెడ్డికి 72 గంటల సమయం ఇస్తున్నానని ఆయన చెప్పారు.
చర్చకు సిద్ధం.. వేదికపై మాటల యుద్ధం
రైతులకు ఎవరు మంచి చేశారన్న దానిపై చర్చ కొత్తేమీ కాదని కేటీఆర్ అన్నారు. “ముఖ్యమంత్రి గారు ముచ్చటపడి రొటీన్‌గా రంకెలు వేశారు. ఆయన ముచ్చట తీర్చడానికి నేను చర్చకు సిద్ధం. ఆయన స్థాయికి కేసీఆర్ అవసరం లేదు, నేను సరిపోతుంది” అని కేటీఆర్ తన ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. కొండారెడ్డిపల్లి, కొడంగల్, చింతమడక, గజ్వేల్ – ఎక్కడైనా చర్చకు సిద్ధమని, సమయం, తేదీ, స్థలం రేవంత్ రెడ్డి ఇష్టమని కేటీఆర్ పునరుద్ఘాటించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు వచ్చినా, మీడియా ముందే చర్చిద్దామని, నీళ్లకు నీళ్లు, పాలకు పాలు చేసేద్దామని ఆయన సవాల్ విసిరారు.

కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ విమర్శలు
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ. 73 వేల కోట్లు జమ చేసిందని, అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఎగ్గొట్టిందని కేటీఆర్ ఆరోపించారు. “కేసీఆర్ ఎకరాకు రూ. 10 వేలు ఇస్తే నేను రూ. 15 వేలు ఇస్తానన్నావు. కేసీఆర్ రెండు పంటలకు ఇస్తుంటే నేను మూడు పంటలకు ఇస్తానన్నావు. మరి ఎక్కడైనా ఎకరాకు రూ. 15 వేల రైతు భరోసా ఇచ్చావా?” అని ప్రశ్నించారు. రైతు భరోసా, రుణమాఫీలో రూ. 39 వేల కోట్ల, రూ. 38 వేల కోట్ల మేర రైతులకు అన్యాయం జరిగిందని ఆయన లెక్కలతో సహా వివరించారు. నాట్లు వేసేటప్పుడు కేసీఆర్ రైతు బంధు ఇస్తే, ఓట్లు వేసేటప్పుడు మాత్రమే రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.
Also Read..| గ్లోబల్ కేపిటల్ ఆఫ్ ఏఐ గా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు
మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్.. “ప్రెస్ క్లబ్ కాదు, అసెంబ్లీకి రండి”
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ దీటుగా బదులిచ్చారు. ప్రజా భవన్‌లో మీడియాతో మాట్లాడిన పొన్నం ప్రభాకర్, కేటీఆర్ అడిగిన చర్చను ప్రెస్ క్లబ్‌లో కాకుండా, శాసనసభ వేదికగా నిర్వహిద్దామని సూచించారు. “బనకచర్ల ఇష్యూ, రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు శాసనసభ స్పీకర్‌కు లేఖ రాస్తే శాసనసభ వేదికగా మేము చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి గారు తెలిపారు” అని పొన్నం స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన శాసనసభ్యుడిగా చర్చ చేయాల్సింది శాసనసభలోనే తప్ప, ప్రెస్ క్లబ్‌లో కాదని ఆయన కేటీఆర్‌కు హితవు పలికారు.

తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం: పొన్నం ప్రభాకర్
తెలంగాణ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ రాజీ పడదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణకు నష్టం జరిగేలా నిర్ణయాలు తీసుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు. “మీరు జగన్‌మోహన్ రెడ్డితో తీసుకున్న నిర్ణయాలు ఓపెన్ సీక్రెట్. రెడ్ కార్పెట్ వేసి నీళ్లు తీసుకుపోయింది మీరే కదా?” అని పొన్నం ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం జరిగిందే బీఆర్ఎస్ హయాంలో అని, తమ ప్రాంత రైతుల హక్కులు కాపాడే బాధ్యత తమదని ఆయన అన్నారు. గోదావరి నికర జలాలు, వరద జలాలు తెలంగాణ హక్కు అని, ఇక్కడి నీళ్లు అక్కడికి ఇస్తామని చెప్పడానికి బీఆర్ఎస్ ఎవరు అని ఆయన నిలదీశారు. భవిష్యత్ తరాలకు తెలిసేలా శాసనసభలో చర్చిద్దామని ఆయన సవాల్ విసిరారు.

రాగల 72 గంటల్లో ఏం జరగనుంది?
ఈ సవాళ్లు, ప్రతిసవాళ్లతో తెలంగాణ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. రానున్న మూడు రోజుల్లో చర్చకు ఏ వేదిక ఖరారవుతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఈ మాటల యుద్ధం ప్రజల్లోకి ఏ మేరకు వెళ్తుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది వేచి చూడాల్సి ఉంటుందది.