రాష్ట్రంలో పాలన పడకేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో జరిగిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన, రాష్ట్ర ప్రభుత్వం, మంత్రుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదంటూ ఆయన ధ్వజమెత్తారు. రైతులకు అన్యాయం జరుగుతోందని, వారు పండించిన ధాన్యం, పత్తి కొనుగోలు చేసే పరిస్థితి లేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలకు బోనస్, పెట్టుబడి సాయం, విత్తనాలు, ఎరువులు కూడా సకాలంలో అందడం లేదన్నారు. ఎరువుల కోసం లైన్‌లో నిలబడి రైతు చనిపోయిన దుస్థితి ఈ ప్రభుత్వ పాలనలో నెలకొందని మండిపడ్డారు. రూ.73 వేల కోట్లు రైతుబంధు రూపంలో రైతుల ఖాతాల్లో వేసిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదైతే, నేడు ఆ రైతుల గోసను పట్టించుకోని ప్రభుత్వం కాంగ్రెస్‌దేనని విమర్శించారు.

నిరుద్యోగులను మోసం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుందని కేటీఆర్ ఆరోపించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఇచ్చినవి ఆరు, ఏడు వేల ఉద్యోగాలు కూడా లేవని ఎద్దేవా చేశారు. దీనిపై మంత్రులు అబద్ధాలు చెబుతున్నారని, అయితే వారు కూడా ఒకరికి ఒకరు పొంతన లేని నెంబర్లు చెబుతున్నారంటూ సెటైర్లు వేశారు. యువతులకు స్కూటీ, మహిళలకు నెలకు రూ.2500, తులం బంగారం ఇస్తామంటూ కాంగ్రెస్ మాట తప్పిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రీ బస్ పేరు చెప్పి, ఆ డబ్బులు పురుషుల నుంచి లాక్కుంటున్నారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్, ఒక్క ఇల్లు కూడా కట్టకపోగా, వేలాది ఇళ్లను నేలమట్టం చేసిందని ఆయన ఆరోపించారు. పెద్దల ఇళ్ల జోలికి వెళ్లని ప్రభుత్వం, పేదల ఇల్లు కనిపిస్తే మాత్రం కూల్చివేస్తోందంటూ విమర్శించారు. మంత్రులు జూబ్లీహిల్స్‌లో గల్లీ లీడర్లలా తిరుగుతూ, పాలనను పక్కన పెట్టేశారని ధ్వజమెత్తారు.
Also Read…| మొంథా తుఫాను బీభత్సంపై అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష
మున్నూరు కాపులకు సముచిత గౌరవం, ప్రాధాన్యం ఇచ్చిన ఘనత బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కే దక్కుతుందని కేటీఆర్ తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తోందని, పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేస్తేనే ఇది జరుగుతుందని తాము ముందే చెప్పినా ఈ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని మండిపడ్డారు. కనీసం ఎన్నికలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలనైనా అమలు చేయాలని హితవు పలికారు. బీసీలకు ఏడాదికి రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి, ఇప్పుడెందుకు ఇవ్వట్లేదో చెప్పాలని నిలదీశారు. బీసీలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. మరోవైపు, దొంగ ఓట్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇది కారుకు, బుల్డోజర్‌కు మధ్య జరుగుతున్న ఎన్నికలన్న ఆయన, బీఆర్‌ఎస్‌ను గెలిపించి, బుల్డోజర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని జూబ్లీహిల్స్ ప్రజలకు పిలుపునిచ్చారు.









