తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి (komuravelli mallikarjuna swamy temple) వారిని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి కొండా సురేఖ కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. దేవాలయ సాంప్రదాయం ప్రకారం ఒగ్గు పూజారులు, వేద పండితులు మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంత్రి సురేఖ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రికి స్వామివారి తీర్ధప్రసాదాలను అందించి, వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు మంత్రికి స్వామివారి చిత్ర పటాన్ని బహూకరించారు. అనంతరం మంత్రి సురేఖ ఆలయ సిబ్బందితో కలిసి దేవాలయ పరిసరాలను పరిశీలించారు. ఆ తర్వాత తమ మనవడి పుట్టు వెంట్రుకలను స్వామివారికి సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. తమ ఇంటి ఇలవేల్పు అయిన కొమురవెళ్లి మల్లన్నను ప్రతియేడు దర్శించుకుంటామని తెలిపారు. ఆనవాయితీగా తమ మనవడి పుట్టు వెంట్రుకలు సమర్పించేందుకు దేవస్థానానికి వచ్చినట్లు తెలిపారు. మల్లన్న ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం వుందని మంత్రి అన్నారు. ఈ దిశగా డిపిఆర్ లు ప్రిపేర్ చేసి, ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి సురేఖ తెలిపారు. డిసెంబర్ లో స్వామివారి కళ్యాణోత్సవం ఉంది కాబట్టి, కళ్యాణం అనంతరం ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇక్కడి పెండింగ్ పనులను పూర్తిచేయడానికి అధికారులతో చర్చిస్తానని మంత్రి స్పష్టం చేశారు.
Also Read | జన్వాడా ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ.. కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలపై కేసు నమోదు
యాదగిరిగుట్ట తరహాలో కొమురవెళ్లి అభివృద్ధి
కురుమ, గొల్లలకు ఆరాధ్య దైవమైన కొమురవెళ్లి మల్లన్న ఆలయాన్ని యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం స్థాయిలో గొప్పగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన భూసేకరణ, సంబంధిత అంశాలపై సమీక్షించిన అనంతరం దేవాలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన తదుపరి నిర్ణయాలను ప్రకటిస్తామని మంత్రి సురేఖ తెలియజేశారు.