కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ దవాఖానలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనను నిరసిస్తూ గత ఎనిమిది రోజులుగా వైద్యులు పెద్దఎత్తున ఆందోళన చేపడుతున్నారు. బాధిత వైద్యురాలికి న్యాయం చేయాలని, విధులను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపు మేరకు, ఇవాళ 24 గంటల పాటు వైద్యులు సమ్మెకు దిగారు. కోల్‌కతా, ఢిల్లీ, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్ సహా అన్ని రాష్ట్రాల్లో వైద్యులు 24 గంటల పాటు సమ్మెకు దిగారు.
ఈ సమ్మె కారణంగా, ఇవాళ ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకూ వైద్య సేవలు అందుబాటులో ఉండవు. ఔట్‌పేషెంట్ సేవలు, ఎంచుకున్న శస్త్రచికిత్స సేవలు అందుబాటులో ఉండవు. అయితే, అత్యవసర వైద్య సేవలు కొనసాగుతాయి.
ఇదిలా ఉండగా, ఈ ఘటనపై ఐఎంఏ కేంద్ర ప్రభుత్వానికి ఐదు డిమాండ్లు ఉంచింది. ఎయిర్‌పోర్టుల మాదిరిగా దేశవ్యాప్తంగా ఉన్న దవాఖానలను కూడా ‘సేఫ్ జోన్లు’గా ప్రకటించాలని, వైద్యులు, సిబ్బందిపై దాడుల కట్టడికి కఠిన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేసింది. హత్యాచారానికి గురైన బాధితురాలు వరుసగా 36 గంటల పాటు డ్యూటీలో ఉన్నారని, ఇది సరైనదేనా అని ఐఎంఏ ప్రశ్నించింది.