హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని.. కేటీఆర్, కిషన్ రెడ్డిలు ‘బ్యాడ్ బ్రదర్స్‘ అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి బీఆరెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 2004-2014 మధ్య పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని, 2014-2023 మధ్య అధికారంలో ఉన్న బీఆరెస్ అభివృద్ధిని పోల్చి చూసి ఓటు వేయాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్, మెట్రో, నాలెడ్జ్ సెంటర్స్, ఐటీ, ఫార్మా వంటి అన్ని రంగాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వాలే బీజం వేశాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ తీసుకున్న ప్రణాళికల వల్లే హైదరాబాద్ ఆదాయం పెరిగిందని, అయితే ఐటీఐఆర్ హైదరాబాద్ కు రాకుండా చేసింది బీఆరెస్, బీజేపీ కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్‌ను రద్దు చేయడం తప్ప, ఈ పదేళ్ల పాలనలో ఈ రెండు పార్టీలు ఒక్క అదనపు ఎయిర్ పోర్టునైనా తెచ్చారా లేదా మెట్రోను ఒక కిలోమీటరైనా విస్తరించారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

బీఆరెస్, బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాన్ని సీఎం రేవంత్ ఎండగట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి లక్ష కోట్లు గోదావరిపాలు చేశారన్నారు. ప్రగతి భవన్ కేవలం కేసీఆర్, ఆయన కుటుంబానికి మాత్రమే ఉపయోగపడిందని ఆరోపించారు. తన కొడుకు కోసం ఉన్న సచివాలయాన్ని కూల్చి కొత్తది కట్టారని.. దాని వల్ల పేద ప్రజలకు ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేదని విమర్శించారు. బీఆరెస్ ఫోన్ ట్యాపింగ్ కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుందని ఆరోపణలు చేశారు. అంతేకాక, 8 లక్షల 11 వేల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని తమకు అప్పగించారని తెలపారు. పదేళ్లలో 20 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వరదల్లో హైదరాబాద్ మునిగిపోతే కిషన్ రెడ్డి కేంద్రం నుంచి చిల్లిగవ్వ తీసుకురాలేదని, సచివాలయంలో ఆలయం కూల్చేస్తే స్పందించలేదని కేంద్రమంత్రిపై మండిపడ్డారు.

తమ ప్రభుత్వంలో ఇప్పటికే వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టులకు అనుమతులు తీసుకొచ్చామని, డ్రై పోర్టు కోసం గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించేందుకు అనుమతులు తెచ్చుకున్నామని తెలిపారు. అలాగే, ఎలీ లిల్లీ వంటి కంపెనీలు ఫార్మా రంగంలో 1 బిలియన్ డాలర్స్ పెట్టుబడులు పెడుతున్నాయని, ఈ ఏడాదిలో 3 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చామని వెల్లడించారు. తాము తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నామని, హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.
Also Read…| ఉద్యోగుల వ్యక్తిగత ప్రతిభకు ‘ఎస్బీఐ-స్టార్’ అవార్డు
తెలంగాణలో గంజాయి, డ్రగ్స్ కనిపిస్తే తొక్కి నార తీస్తామని హెచ్చరించారు, కేటీఆర్ డ్రగ్స్ తీసుకుని దొరికిన తన బావమరిది గురించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నవీన్ యాదవ్ రౌడీ కాదని.. పేదోళ్లకు అండగా నిలబడుతాడని వివరిచారు. విద్యారంగం గురించి మాట్లాడుతూ.. విద్య వ్యాపారం కాదు సేవ అని అన్నారు. అడిగినవి ఇవ్వలేదని కాలేజీలు బ్లాక్ మెయిల్ చేస్తామంటే ప్రభుత్వం సహించదని, విడతలవారీగా నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. సర్వేలపై చర్చ అనవసరమని, నిజం నవంబర్ 14 న తెలుస్తుందని అన్నారు. ఈ ఎన్నికలో బీఆరెస్ ఓటమి, బీజేపీ డిపాజిట్ గల్లంతు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ, జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి కాంగ్రెస్‌ను గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.









