జమ్మూకశ్మీర్ అభివృద్ధికి అడ్డుగా ఉండి, అక్కడి ప్రజల స్వేచ్ఛకు సంకెళ్లుగా మారిన ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని జమ్మూకశ్మీర్ సహా యావద్భారతం స్వాగతిస్తే.. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ‘బ్లాక్ డే’ గా చెప్పుకోవడం అత్యంత దురదృష్టకరమని కేంద్రమంత్రి, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇంచార్జ్ ఇంచార్జ్ జి.కిషన్ రెడ్డి అన్నారు.
ఆర్టికల్ 370 రద్దుకు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా.. ఈ చారిత్రక ఘట్టాన్ని కాంగ్రెస్ పార్టీ ‘బ్లాక్ డే’ గా పరిగణించడంపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి 2019 వరకు కశ్మీర్ లో అశాంతికి, అభివృద్ధి జరగకపోవడానికి కాంగ్రెస్సే కారణమని.. అలాంటి పార్టీ ఇవాళ జమ్మూకశ్మీర్ అభివృద్ధి చూసి జీర్ణించుకోలేకపోతోందన్నారు.
జమ్మూకశ్మీర్ కు స్వతంత్రత కల్పించే విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వ్యతిరేకించేలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడటం.. న్యాయస్థానాలను అగౌరవపరచడమేనన్నారు.
ఆగస్టు 5ను బ్లాక్ డేగా పరిగణించాలన్న కాంగ్రెస్ ఆవేదన యావద్భారతానికి అర్థమైందన్నారు. కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కింది ప్రశ్నలను సంధించారు
- వెనుకబాటునుంచి, కుటుంబ రాజకీయాలనుంచి జమ్మూకశ్మీర్ కు స్వతంత్రత కల్పించినందుకు బ్లాక్‌డేనా..?
- ఏళ్లుగా.. రిజర్వేషన్‌కు దూరంగా ఉన్న ఎస్సీ, ఎస్టీలకు వాళ్ల హక్కులు లభించినందుకు బ్లాక్‌డేనా..?
- ప్రజల హక్కులను కాలరాసిన, వివక్షపూరితంగా ఉన్నటువంటి.. 890 కేంద్ర చట్టాలను, 205 రాష్ట్ర చట్టాలను తొలగించినందుకు బ్లాక్‌డేనా..?
- 73వ సవరణ ప్రకారం 27 హక్కులను స్థానికసంస్థలకు ఇవ్వడం, పంచాయతీలకు సరైనన్ని నిధులిచ్చి రోడ్లు, విద్య, వైద్యంపై ఖర్చు చేసినందుకు బ్లాక్‌డేనా..?
- దశాబ్దాలుగా వివక్షకు గురైన పశ్చిమ పాకిస్తానీ శరణార్థులు, వాల్మీకీలు, గోర్ఖాలు, సఫాయి కర్మచారుల వంటి 60 లక్షల మందికి డొమిసైల్ సర్టిఫికెట్లు ఇచ్చినందుకు బ్లాక్‌డేనా..?
- రూ. 58,477 కోట్ల ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీలో భాగంగా.. 53 కీలకమైన ప్రాజెక్టులు పూర్తిచేసినందుకు బ్లాక్‌డేనా..?
- పర్యాటక రంగానికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తూ.. పర్యాటకంపై ఆధారపడి జీవిస్తున్న సగటు ముస్లిం కుటుంబంలో వెలుగులు విరజిమ్ముతున్నందుకు బ్లాక్‌డేనా..?
- యువతకు తగినన్ని విద్యావకాశాలు కల్పిస్తూ, నైపుణ్యతను అందిస్తూ.. కొత్తగా 16,650 ఉద్యోగావకాశాలు కల్పించినందుకు బ్లాక్‌డేనా..?
అన్ని రకాలుగా జమ్మూకశ్మీర్ అభివృద్ధిలో సమూలమైన మార్పులు వచ్చి.. ప్రజలు స్వచ్ఛందంగా ప్రజాస్వామ్య పరిరక్షణలో పాల్గొనటాన్ని చూసి జీర్ణించుకోలేక.. కళ్లు మూసుకున్న కాంగ్రెస్ పార్టీకి చీకటి కనిపించడం సహజమే.. అందుకే వారు చరిత్రాత్మకమైన రోజును ఉత్సవంగా కాకుండా.. చీకటి రోజుగా జరుపుకుంటున్నారన్నారని కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీని దేవుడు కూడా కాపాడలేడని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.