Menu

  • Home
  • తెలంగాణ
  • ఇమ్మడి రవి అరెస్ట్.. ఐబొమ్మ, బప్పం టీవీలు మూసివేత !
piracy kingpin immadi ravi arrest ibomma bappamTV closed

ఇమ్మడి రవి అరెస్ట్.. ఐబొమ్మ, బప్పం టీవీలు మూసివేత !

తెలుగు సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టాన్ని కలిగించిన ఐబొమ్మ (i-Bomma), బప్పం టీవీ (Bappam TV) వెబ్‌సైట్ల ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి ఈ పైరసీ సామ్రాజ్యాన్ని నడుపుతున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన రవిని, తన భార్యతో విడాకుల నిమిత్తం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు రాగానే పక్కా సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసిన రవి, గతంలో హైదరాబాద్‌లో “ER infotech” అనే సాఫ్ట్‌వేర్ కంపెనీకి సీఈఓగా పనిచేసినట్టు పోలీసులు గుర్తించారు. తనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తెలుగు చిత్రసీమకు దాదాపు రూ. 3 వేల కోట్ల నష్టాన్ని చేకూర్చాడని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ అరెస్ట్‌తో చిత్ర పరిశ్రమ పెద్దలు ఊపిరి పీల్చుకున్నారు.

పోలీసుల అదుపులోకి వచ్చిన ఇమ్మడి రవి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టిన సైబర్ క్రైమ్ విభాగం, గతంలో రవి చేసిన సవాల్‌కు అనుగుణంగా అతనితోనే ఐబొమ్మ , బప్పం టీవీ వెబ్‌సైట్‌లను మూసివేయించారు. రవి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న వెబ్ లాగిన్‌లు, సర్వర్ వివరాలను ఉపయోగించి ఈ పైరసీ వెబ్‌సైట్‌లను పూర్తిగా షట్‌డౌన్ చేశారు. కరేబియన్ దీవుల నుంచి తన కార్యకలాపాలను సాగిస్తున్న రవి వద్ద సీజ్ చేసిన హార్డ్ డిస్క్‌లను ప్రస్తుతం పోలీసులు విశ్లేషిస్తున్నారు.

Also Read..| తెలంగాణపై విన్‌గ్రూప్ ఫోకస్.. EV పెట్టుబడులపై ఆసక్తి

రవిని మరింత లోతుగా విచారించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీ కోరనున్నారు. ఇందుకోసం నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేయనున్నట్లు సమాచారం. రవికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలను, దాదాపు రూ. 3 కోట్లను పోలీసులు ఇప్పటికే ఫ్రీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇమ్మడి రవి వెనుక ఉన్న ఇతర నెట్‌వర్క్ సభ్యులను, ఈ పైరసీ కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన వారి వివరాలను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Share the post