హైదరాబాద్‌లోని గాంధీభవన్ వద్ద గొర్రెలు, మేకలతో గొల్ల కురుమల నిరసనన జరిగింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదంటూ, యాదవ, కురుమ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఈరోజు గాంధీభవన్ ఎదుట గొర్రెలు, మేకలతో నిరసన తెలిపారు. మంత్రివర్గంలో తమ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు, పలు సంక్షేమ పథకాలను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు
Also Read..| ఇరాన్‌పై అమెరికా దాడిపై UNO చీఫ్ గుటెరస్ ఆందోళన
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా, తమ సామాజిక వర్గాలకు న్యాయం జరగలేదని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో కూడా యాదవ, కురుమ వర్గాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ సంక్షేమానికి సంబంధించిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని, గొర్రెలు, మేకలకు అందించాల్సిన మందులు, టీకాలు కూడా సక్రమంగా లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

గొర్రెలు, మేకలతో గొల్ల కురుమల నిరసన.. ప్రధాన డిమాండ్లు
- తెలంగాణ మంత్రివర్గంలో యాదవ, కురుమ సామాజిక వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి.
- జనాభా నిష్పత్తి ప్రకారం రాష్ట్ర, జిల్లా స్థాయి పదవులలో తమ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రభుత్వ కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవుల్లోనూ తగిన అవకాశాలు కల్పించాలి.
- రూ. 10,000 కోట్లతో యాదవ, కురుమ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి.
- గొర్రెలు, మేకలకు వచ్చే వ్యాధులకు ఉచితంగా మందులు అందించాలి, ముఖ్యంగా నట్టల మందులను తక్షణమే విడుదల చేయాలి.
- 50 సంవత్సరాలు పైబడిన గొర్రెల కాపరులకు నెలకు రూ. 6,000 పింఛన్ అందించాలి. గొర్రెల కాపరులకు ఇచ్చే పరిహారాన్ని రూ. 10 లక్షలకు పెంచాలి.
- తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వంద కోట్ల రూపాయల ఎన్పీడీసీ (నాన్-ప్రాఫిట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) రుణాలను వెంటనే మాఫీ చేయాలి. రాష్ట్రంలో ప్రతి గొర్రె, మేకకు బీమా కల్పించాలి.
- తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల రెగ్యులేటరీ మార్కెట్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలి. ప్రతి నియోజకవర్గంలో గొర్రెల, మేకల మార్కెట్ యార్డులు, జిల్లాకు ఒక మీట్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మించాలి.
గొర్రెలు, మేకలతో గొల్ల కురుమల నిరసన.. పోలీసుల జోక్యం
నిరసన తీవ్రతరం అవుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగి, నిరసనకారులను అదుపులోకి తీసుకుని గాంధీభవన్ నుంచి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు తమతో పాటు తెచ్చిన మూగజీవాలను కూడా అమానుషంగా ఈడ్చిపడేశారని, డీసీఎంలోకి విసిరేశారని నాయకులు ఆరోపించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని, దీనివల్ల జీవాలకు గాయాలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నిరసన కార్యక్రమం ద్వారా కురుమ, యాదవ సంఘాలు తమ ఆవేదనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశాయి. ఈ సంఘాల డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.