ప్రభుత్వ ఉద్యోగి చేసే అవినీతిని రాజ్యానికి, సమాజానికి వ్యతిరేకంగా చేసిన నేరంగానే చూడాలని సుప్రీం కోర్టు అభిప్రాయ పడింది. డబ్బులు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని మోసం చేసిన నిందితులకు సంబంధించిన క్రిమినల్ కేసును సంబంధిత కక్షిదారుల మధ్య రాజీ కుదిరింది అన్నకారణంతో మద్రాసు హైకోర్టు కొట్టి వేయడాన్నిసుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం తప్పు పట్టింది. హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టి, నిందితులపై క్రిమినల్ ఫిర్యాదును మళ్లీ తెరవాలని ఆదేశించింది. డబ్బులతో ప్రభుత్వ ఉద్యోగాలను కొనేవారు తిరిగి ఆమొత్తం సంపాదించడానికి అవినీతికి పాల్పడతారని దీంతో పరోక్షంగా ప్రజలు బాధితులు అవుతారని కోర్టు వ్యాఖ్యానించింది. అందువల్ల, ఇలాంటి కేసుల్లో నిందితులను ఉపేక్షించకూడదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.