మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాన ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించింది. ఈ సంధర్బండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడిన క్లిష్ట సమయంలో ఇందిరా గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు. ఆమె అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. బ్యాంకుల జాతీయకరణ, అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా పేదలకు భూములు పంచడం, ఇండ్లు కట్టించడం ఇందిరమ్మకే సాధ్యమైందని కొనియాడారు. పాకిస్థాన్ తో యుద్ధం సమయంలో ధీటుగా నిలబడి ఎదుర్కొన్న ధీశాలి ఇందిరమ్మ అని, దేశానికి బలమైన నాయకత్వం అందించిన ఘనత ఆమెకే దక్కుతుందని సీఎం అన్నారు.
ఇందిరమ్మ స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మహిళల సంక్షేమంతో పాటు ఆర్థిక ఉన్నతి కలిగించేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. మహిళలకు పెట్రోల్ బంక్ లు నిర్వహించుకునేలా ప్రోత్సహించామని, ఆర్టీసీలో వెయ్యి బస్సులకు మహిళలనే యజమానులను చేశామని తెలిపారు. ఆడబిడ్డల పేరుతోనే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని, రాజకీయాల్లోనూ మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించామని వివరించారు.

ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రాంరంభం
తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరపున సారె పెట్టి గౌరవించాలని తమ ప్రభుత్వం భావించిందని సీఎం తెలిపారు. అందుకే కోటి మంది ఆడబిడ్డలకు కోటి చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇందిరమ్మ జయంతి రోజున ప్రారంభించామని, ఎవరూ ఆందోళన చెందొద్దని, ప్రతీ ఆడబిడ్డకు చీరను అందిస్తామని హామీ ఇచ్చారు. చీరల ఉత్పత్తికి సమయం పడుతున్నందున, మొదటి విడతలో 65 లక్షల చీరలను పంపిణీ చేయబోతున్నామని, మిగిలినవి రెండు విడతలుగా అందిస్తామని అన్నారు. ఈ సందర్భంగా సీఎం పలువురు లబ్ధిదారులకు చీరలను అందించి పంపిణీని ప్రారంభించారు.

ఇందిరమ్మ చీరల పంపిణీ పై వీడియో కాన్ఫరెన్స్
అనంతరం, సచివాలయంలో వివిధ జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్య సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకాటి శ్రీహరి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆడబిడ్డలకు సారె, చీర పెట్టడం తెలంగాణ సంప్రదాయమని చెబుతూ… ‘మహిళల ఉన్నతి- తెలంగాణ ప్రగతి’ కార్యక్రమం పేరుతో ఇందిరమ్మ చీరల పంపిణీని పండగ వాతావరణంలో చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

ప్రతీమహిళకు ఇందిరమ్మ చీరల పంపిణీ
ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి డిసెంబర్ 9 వరకు, పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి 8 వరకు చీరల పంపిణీ ఉంటుందని స్పష్టం చేశారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. వివాదాలకు తావు లేకుండా, పూర్తి వివరాలతో ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీరలు అందేలా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశించారు.

Also Read..| మరోసారి బిహార్ సీఎంగా నితీశ్ కుమార్.. ప్రమాణస్వీకారం ఎప్పుడంటే ?
అతకుముందు, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని సందర్భంగా నెక్లెస్ రోడ్ లో ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొని ఇందిరా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.









