హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమెరికా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అమెరికా స్వాతంత్య్రం పొందిన తర్వాత ప్రపంచం పూర్తిగా మారిపోయిందని, ప్రజాస్వామ్యానికి మార్గదర్శిగా, నిరంతర ఆవిష్కరణలను అందిస్తూ ప్రపంచ దృక్కోణాన్ని అమెరికా మార్చిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఓటమిని అంగీకరించని స్ఫూర్తి అమెరికాదని, అనేక అంశాల్లో సానుకూల పరిష్కారాలను చూపగలిగిందని ఆయన ప్రశంసించారు.

తెలంగాణ స్ఫూర్తి కూడా అమెరికా స్ఫూర్తికి ఎంతో సారూప్యత కలిగి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్నేహాన్ని కోరుకోవడం, బంధాన్ని మరింత పటిష్టపరుచుకోవడం తెలంగాణ ప్రత్యేకత అని ఆయన వ్యాఖ్యానించారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఏర్పాటైందని ఆయన గుర్తు చేశారు. భారతదేశంతో దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో అమెరికా ఎంతో నిబద్ధతను ప్రదర్శించిందని, అమెరికాతో తెలుగు ప్రజలకు ఉన్న స్నేహపూర్వక బంధం ఎంతో బలమైందని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో తెలుగు భాష వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.
Also Read..| జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు
హైదరాబాద్ కాన్సుల్ జనరల్ శ్రీమతి జెన్నిఫర్ లార్సన్ రెండు సంస్కృతుల మధ్య, ప్రజల మధ్య, వాణిజ్యపరమైన సంబంధాలను పటిష్టం చేయడంలో ఇరు దేశాల మధ్య బలమైన వారధిగా నిలుస్తున్నారని ముఖ్యమంత్రి కొనియాడారు. ఐటీ, ఫార్మా, డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఏరోస్పేస్ వంటి రంగాలకు చెందిన దాదాపు 200 అమెరికా కంపెనీలు ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. ఎంతో మంది విద్యార్థులు తమ కలలను నెరవేర్చుకోవడానికి తెలంగాణ నుంచి అమెరికా వెళుతున్నారని, అమెరికా-తెలంగాణల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణను 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ‘తెలంగాణ రైజింగ్’ దార్శనికతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ లక్ష్య సాధనకు అమెరికన్ల మద్దతు కావాలని ఆయన కోరారు. జాతీయ స్థాయిలో పరస్పర విశ్వాసం, విలువల ఆధారంగా అమెరికా-భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని, వ్యాపార, వాణిజ్య రంగాలు, పెట్టుబడులు, ప్రజాస్వామ్యాన్ని విస్తృతం చేయడం, ప్రపంచ శాంతిని నెలకొల్పడం వంటి లక్ష్యాలతో ఇరు దేశాలు స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటున్నాయని ఆయన వివరించారు. ముఖ్యంగా సైనిక విన్యాసాలు, అంతరిక్ష పరిశోధనలో సహకారం, సాంకేతిక రంగంలో పెట్టుబడులకు సంబంధించిన వాణిజ్యంలో ఇరు దేశాలు రికార్డులను నెలకొల్పాయని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో మరింత పురోభివృద్ధి సాధించాలని, అమెరికాలోని అత్యుత్తమమైన వాటిని తెలంగాణకు తీసుకొస్తారని తాను ఆశిస్తున్నానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ వేడుకలకు నిర్దేశించిన థీమ్ “ఒక్కటిగా ఉంటే.. మరింత పటిష్టంగా..” ఎదగగలమని తాను విశ్వసిస్తున్నానని రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.










