బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల ఘటనల వెనుక పాకిస్తాన్ , చైనా కుట్రలు ఉన్నాయని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నాయని… అయితే ఆ ఘటనలపై రాహుల్ గాంధీ కనీసం నోరు మెదపకపోవడం, ఖండించకపోవడం దారుణమన్నారు. భారతదేశాన్ని కులాల పేరుతో, మతం పేరుతో విడగొట్టాలని కొన్ని విదేశీ శక్తులతో పాటు, స్వదేశంలోని కాంగ్రెస్ వంటి కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రభుత్వం ఓట్ల కోసం రోహింగ్యాలకు ఆధార్ కార్డులు, ఆశ్రయంతో పాటు సకల సదుపాయాలు కల్పిస్తూ దేశ సంపదను పంచిపెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాలు, అరబ్బు దేశాలు భారత దేశాన్ని బలహీన పర్చాలని చూస్తున్నాయని… విచ్ఛిన్నకర శక్తుల సవాళ్లను ప్రతి భారతీయుడు కులాలు, మతాలకు అతీతంగా ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని డాక్టర్ కె. లక్ష్మణ్ పిలుపునిచ్చారు.