ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ పార్టీగా పుట్టిన బీఆర్ఎస్ పార్టీ 2014లో స్వరాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంది. పదేండ్ల పాటు తెలంగాణను పాలించిన ఆ పార్టీకి… 2024 సంవత్సరం చేదు అనుభవాన్ని మిగిల్చింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటమిని చవిచూసింది. 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 17 ఎంపీ సీట్లకు గాను ఒక్కటంటే ఒక్క సీటు గెలవలేదు. గెలవడం మాట అటుంచితే, కనీసం రెండో స్థానంలో కూడా లేకుండా.. మూడో స్థనానికి పరిమితం అయింది. కొన్నిచోట్ల డిపాజిట్లు కూడా రాకపోవడాన్ని గులాబీ కార్యకర్తలు నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.
బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బలు
పార్లమెంట్ ఎలక్షన్లతో పాటే జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికలోనూ సిటింగ్ సీటునూ కోల్పోయింది. ఇలా కారుపార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. వీటికి తోడు పార్టీ అధినేత అనారోగ్యం పాలవడం, ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో జైలుకు వెళ్లడం, 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరడం పార్టీని మరింత కుంగదీశాయి. 2024 ఏడాది చివర్లో ఫార్ములా ఈకార్ రేసులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ, ఈడీ కేసులు నమోదు నమోదు చేయడం ఆపార్టీ షాక్ కు గురి అయింది. హైకోర్టు జోక్యంతో కేటీఆర్ అరెస్టు ఆగినా.. ఈడీ కేసు వెంటాడడం ఆ పార్టీ నేతలను కలవర పరుస్తుంది.
Also Raed..| తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !
అధికారాన్ని కోల్పోయాక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమవుతూ వస్తున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి ఒకసారి, 2024 మార్చిలో నిర్వహించిన బడ్జెట్ సమావేశాలకు ఒకసారి, అదీ ఒక్కరోజు తప్ప మిగతా ఏ సందర్భంలోనూ ఆయన అసెంబ్లీకి హాజరు కాకపోవడం విమర్శలకు తావు ఇస్తుంది. సీఎం రేవంత్, అధికార పార్టీ నేతలు ఈ విషయాన్ని శాసన సభలోనూ, బయటా పదేపదే ప్రస్తావించడం ద్వారా కారు పార్టీని ఇరకాటంలో పడేశారు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తి సభకు వచ్చి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని.. ఆయన ప్రజల తీర్పును అపహాస్యం చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. అయినా కేసీఆర్ సభకు మాత్రం రాకపోవడం గమనార్హం. పార్టీ వర్కింగ్ ప్రెసడింట్ కేటీఆర్, హరీష్ రావులే అసెంబ్లీలో అన్నీ తామై బీఆర్ఎస్ ను నడిపించారు.

బీఆర్ఎస్ పార్టీకి అందివచ్చిన అవకాశాలు
వరుస ఓటములతో సతమతమవుతున్న బీఆర్ఎస్ కు హైడ్రా, లగచర్ల ఘటనలు అందివచ్చిన అవకాశాలుగా దొరికాయి. మూసీప్రజాక్టు, హైడ్రాపై బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించింది. ఇండ్లు కోల్పోయిన పేదల పక్షాల ప్రభుత్వంపై పోరాటం చేస్తానని ప్రకటించి ఆందోళనలు నిర్వహించింది. లగచర్ల రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపింది. రైతు రుణమాఫీ, రైతుభరోసా పై ప్రభుత్వంపై విమర్శలతో దాడి చేసింది. గురుకులాల్లోని ఫుడ్ పాయిజన్ ఘటనలపై గురుకులాల బాట పట్టి విద్యార్ధులకు అండగా నిలిచింది. తాజాగా ఎమ్మెల్సీ కవిత బీసీల రిజర్వేషన్లపై పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని.. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది.
మొత్తానికి గులాబీ పార్టీ తన ఉనికిని కాపాడుకునేందుకు శత విధాలా ప్రయత్నాలు చేస్తుంది. 2025 లో అయినా గులాబీ పార్టీకి కలిసివస్తుందా.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ గుబాలిస్తుందా తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..