మంత్రి వర్గంలోని ఏశాఖలో చూసిన మొత్తం అవినీతి కనపడుతున్నదని ఇరిగేషన్,సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికలలో గెలుపొందిన తర్వాత తొలిసారిగా మేళ్లచెరువు శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని అప్పుల కుప్పలోకి నాటి సిఎం కేసీఆర్ నెట్టేశారన్నారు. రాష్ట్ర సంపద మాత్రం కేసీఆర్ ఫ్యామిలీ జేబుల్లోకి చేరిందన్నారు. గడిచిన పదేళ్లలో ఊహకందని అక్రమాలు,కబ్జాలు చేసి రాష్ట్రాన్ని లూటీ చేసి వెళ్లిపోయారని అన్నారు.అందుకే ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అలాంటి వాటికి తావు ఇవ్వదని చెప్పారు. కాళేశ్వరం పేరుతో 93 వేల కోట్లు అప్పు చేసి కడితే సరిగ్గా మూడేళ్లు కూడా గడవకముందే మేడిగడ్డ,అన్నారం కుంగిందని, ఇదీ వాళ్లు చేసిన నిర్వాకమని చెప్పారు. అరవై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి ఎపిగా ఉన్నప్పుడు మొత్తం 60 వేల కోట్ల అప్పులుంటే కొత్తగా తెలంగాణ ఏర్పడ్డ నాటినుండి ఇప్పటి వరకూ 6లక్షల 60 వేల కోట్ల అప్పులు కేసీఆర్ మిగిల్చి వెళ్లారని అన్నారు.పిల్లల భవిష్యత్ తాకట్టు పెట్టి అప్పుల భారాన్ని మోపిపోయారన్నారు.రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చామని నమ్మబలికి కేవలం 9 గంటలే సరఫరా చేశారని వివరించారు. గతంలో రేషన్న్ బియ్యాన్ని కొన్ని బ్లాక్ మార్కెట్ కు తరలించి అమ్మేవారని, ఈ సారి అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సివిల్ సప్లయ్ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేసి, పారదర్శకమైన పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడైనా చెరువులు కబ్జా చేస్తే ఆ స్థలాలను వాపస్ తీసుకుంటామని చెప్పారు. ఫిబ్రవరి రెండో వారంలో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ రానున్నదని,ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 13 లేదా14 సీట్లలో గెలవబోతున్నదని ధీమా గా చెప్పారు.నల్గొండ పార్లమెంట్ స్థానంలో మూడు లక్షల మెజార్టీ సాధించనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.
డెవలప్ మెంట్ లో హుజూర్‌నగర్ ను ఇక పరుగులు పెట్టిస్తా
గతంలో కంటే హుజూర్‌నగర్ నియోజకవర్గాన్ని అభివృద్దిలో పరుగులు పెట్టించనున్నట్లు ఉత్తమ్ తెలిపారు. ఏడుసార్లు ఒకే ప్రాంతం నుండి గెలిచి అరుదైన రికార్డు తనకు లభించిందని గుర్తు చేసుకున్నారు. మరింత అభివృద్ది కోసం నియోజకవర్గం లో ఉన్న దొంగలను తరిమికొడతానని, నాలుగేళ్లలో లెక్కలేనన్ని కబ్జాలు, దందాలు చేశారని అన్నారు. చివరకు మేళ్లచెరువు శివున్ని కూడా వదల్లేదని,గుడి జాతర పేరుతో వసూళ్లు చేశారని మండిపడ్డారు. రెండు గ్రామాల పంచాయితీల్లో అక్రమాలు జరిగాయని ఎంక్వైరీ చేపిస్తే ప్రాధమికంగా మేళ్లచెరువు జిపిలో రెండు కోట్లు, మఠంపల్లి జిపిలో 75 లక్షల అవినీతి వెలుగు చూసిందని అన్నారు. ఈ లెక్కన మిగిలిని జిపిల్లో ఎంత దండుకున్నారో మీరే ఆలోచించాలని అన్నారు. కోదాడ,హుజూర్‌నగర్ నియోజకవర్గాల పరిధిలో లిఫ్టులను రిపేర్లు చేయించి, అవసరమున్నచోట కొత్త లిఫ్టులకు ప్రతిపాదనలు రడీ అవుతున్నాయని అన్నారు. లిఫ్టుల నిర్వహణ భారం రైతులపై పడకుండా ప్రభుత్వమే నిర్వహచే ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. మేళ్లచెరువు లో నిర్మిస్తున్న అండర్ పాస్ రైల్వే బ్రిడ్జినిర్మాణపు పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయనే సమాచారాన్ని రైల్వే జిఎంతో ఫోన్ లో మాట్లాడి తెలుసుకున్నారు. అండర్ పాస్ స్థానంలో ఫ్లై ఓవర్ ప్రతిపాదననను పరిశీలించాలని కోరారు.