Menu

  • Home
  • తెలంగాణ
  • ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ కు బీజేపీ మద్దతు: ఎంపి చామల
Image

ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ కు బీజేపీ మద్దతు: ఎంపి చామల

కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఆలస్యం కావడం వెనుక కేటీఆర్ కు బీజేపీ మద్దతు ఉంద‌ని భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో (Formula-E Case) కేటీఆర్‌పై ఛార్జ్ షీట్ దాఖలు చేయాలంటే, ఆ కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పై కూడా ప్రాసిక్యూషన్‌కు అనుమతి అవసరమని ఆయన గుర్తు చేశారు. అరవింద్ కుమార్ పై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డీఓపీటీ (Department of Personnel and Training) కి లేఖ రాసినప్పటికీ, గవర్నర్‌పై ఒత్తిడి తెచ్చి బీజేపీ ఆ అనుమతి రాకుండా అడ్డుకుందని చామల ఆరోపించారు. డీఓపీటీలో కూడా అరవింద్ కుమార్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేయకుండా బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని, దీనిని బట్టి ఫార్ములా-ఈ కార్ రేసులో బీజేపీ కేటీఆర్‌కు మద్దతు ఇస్తున్నట్లు స్పష్టమవుతోందని అన్నారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, కేటీఆర్ పాలన నడుస్తోందంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాష్ట్రం అప్పుల పాలవ్వడానికి ప్రధాన కారణం గత బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఇవ్వడమేనని కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 2014 నుండి 2023 వరకు తొమ్మిది సంవత్సరాల పాటు బీఆర్ఎస్, బీజేపీ కలిసి ప‌ని చేశాయని’ ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన దోపిడీని అరికట్టడంలో బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు విఫలమయ్యారని ఆయన ప్రశ్నించారు.

Also Read..| అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే..మతతత్వ ముద్ర వేస్తారా? : బండి

ఫార్ములా-ఈ కార్ రేస్ కేసును ‘లొట్టపీసు’ కేసుగా కేటీఆర్ అభివర్ణించారని, ఆయన తక్షణమే విచారణకు సహకరించాలని కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసులో వాస్తవాలను ఏసీబీ నిగ్గు తేల్చాలని కోరారు. బండి సంజయ్ ‘చిల్లర మాటలు’ బంద్ చేసి, ఐఏఎస్ అరవింద్ కుమార్ పై విచారణ జరిగేలా డీఓపీటీని ఒప్పించాలని సవాల్ విసిరారు.

Share the post