అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాల కల నెరవేరింది. వైభవంగా బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట జరిగింది. సరిగ్గా 12:29 నిమిషాలకు అభిజిత్ ముహూర్తంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతులమీదుగా అంగరంగ వైభవంగా జరిగింది. 84 సెకన్లపాటు ప్రాణప్రతిష్ట క్రతువు కొనసాగింది. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కన్నుల పండువగా ఈ మహోత్సవం కొనసాగింది. బాలరాముడికి ప్రధాని పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు హెలికాప్టర్లో ఆలయంపై పూలవర్షం కురిపించారు. ఈకార్యక్రమంలో మోడీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎడమచేతిలో విల్లు, కుడిచేతిలో బాణంతో, చిరుదరహాసంతో, స్వర్ణాభరణాలతో బాలరాముడు భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. శ్రీరామ నామస్మరణతో అయోధ్య నగరం మార్మోగిపోతోంది. దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, శ్రీరామ కీర్తనలు, భజనలు చేస్తున్నారు. ప్రాణ ప్రతిష్టను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసేందుకు ప్రజలు టీవీలు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయారు. పలు నగరాలు, పట్టణాల్లో శ్రీరాముని శోభాయాత్రలు జరుగుతున్నాయి.