ఎన్నికల్లో గెలిపించకుంటే భార్య పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని నియోజకవర్గ ప్రజలను బ్లాక్ మెయిల్ చేసి గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మంత్రి సీతక్కను విమర్శించే స్థాయి కాదని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణక్క అన్నారు. మంగళవారం ఉట్నూర్ లోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి సీతక్కపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నీచ చరిత్ర ఏంటో తెలంగాణ సమాజానికి తెలుసని అన్నారు. ఎన్నికల్లో గెలిపించకుంటే కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల సింపతితో ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ అభివృద్ధిని, ప్రజలను పట్టించుకోకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్,మాజీ మంత్రి కేటీఆర్ ల మన్ననలు పొందటానికి మంత్రి సీతక్క పై అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని ఖండిస్తున్నామని అన్నారు.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా పేరుందిన మంత్రి సీతక్క కరోనా కష్టకాలంలో తన నియోజకవర్గ ప్రజల కోసం చేసిన సేవలు అప్పుడు అధికారంలో ఉన్న మీ పార్టీ నాయకులు కూడా చేయలేదని గుర్తుచేశారు. ఇప్పటికైనా నీ దొర అహంకారం తగ్గించి మాట్లాడాలని, సీతక్కపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనుకకు తీసుకొని, అసెంబ్లీలో బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.