మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఏర్పాటు చేసిన సిట్ విచారణకు కేసీఆర్ హాజరుకానున్నారు. హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఉన్న ఆయన నివాసంలోనే విచారణ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. ఈ కేసులో భాగంగా ఇప్పటికే కేసీఆర్‌కు SIT నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే నోటీసులు అందించిన విధానంపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారులకు లేఖ రాశారు. నోటీసులు చట్టబద్ధంగా అందలేదని పేర్కొన్నప్పటికీ, విచారణకు సహకరిస్తామని ఆయన స్పష్టం చేయడంతో నేడు విచారణకు హాజరవుతున్నారు.
SIT అధికారులు కేసీఆర్‌ను ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరిగిన నిర్ణయాలు, అప్పటి పాలనలో పోలీస్ వ్యవస్థ పాత్ర, ఉన్నతాధికారులకు ఇచ్చిన ఆదేశాలపై ప్రశ్నించే అవకాశం ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా విచారణను కేసీఆర్ నివాసంలోనే నిర్వహించాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ఈ విచారణ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ నేతలు ఈ చర్యను రాజకీయ కక్షసాధింపుగా విమర్శిస్తుండగా, కేసీఆర్ కు నోటీసులు, విచారణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. అధికార పార్టీ మాత్రం చట్టం ముందు అందరూ సమానులేనని, కేసీఆర్ చట్టానికి అతీతుడు కాడని విమర్శు చేస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ – కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ విమర్శలు చేస్తుంది. కేసీఆర్ విచారణ నేపథ్యంలో హైదరాబాద్‌లో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.









