Menu

  • Home
  • తెలంగాణ
  • 16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి
kishanreddy handedover appointment letters in 16th rozgar mela

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటున్న యువతకు, వారి కుటుంబాలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ‘వికసిత్ భారత్ – 2047’ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత పాత్ర కీలకమని కిషన్ రెడ్డి ఉద్ఘాటించారు. దేశ ప్రగతిలో రాబోయే 25 ఏళ్లు యువతే ప్రధాన భాగస్వాములు కాబోతున్నారని ఆయన అన్నారు.

16వ రోజ్‌గార్ మేళాలో కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటివరకు జరిగిన 15 విడతల రోజ్‌గార్ మేళా ద్వారా దేశవ్యాప్తంగా 10.50 లక్షల మందికి నియామక పత్రాలు అందజేశామని, ఈ విడతలో మరో 51 వేల మందికి అపాయింట్‌మెంట్ ఇస్తున్నామని వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా (సగటున 30 ఏళ్లు) ఉండటం భారతదేశానికి బలం అని, ఇది దేశం పట్ల మన బాధ్యతను పెంచడంతో పాటు విస్తృత అవకాశాలకు బాటలు వేసిందని అన్నారు. యువశక్తి సామర్థ్యం వల్లే భారతదేశం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మోదీ గారి నేతృత్వంలో కేవలం ఉద్యోగాల కల్పనతో పాటు, యువతే కొత్త అవకాశాలను సృష్టించేలా సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ‘జాబ్ సీకర్స్’ నుంచి ‘జాబ్ క్రియేటర్స్’గా మారేలా యువతను ప్రోత్సహించడమే మోదీ ఆలోచన అని, పాత పద్ధతులకు స్వస్తి పలికి, స్టార్టప్స్, స్కిల్లింగ్ వంటి వాటి ద్వారా యువతకు సాధికారత కల్పిస్తూ బలమైన వ్యవస్థను నిర్మిస్తున్నారని వివరించారు.

ఆర్థిక వృద్ధి గణాంకాలు, సంక్షేమ పథకాలు..16వ రోజ్‌గార్ మేళా

EPFO లెక్కల ప్రకారం, 2017 నుంచి 8.5 కోట్ల మందికి కొత్త ఉద్యోగాలు వచ్చాయని కిషన్ రెడ్డి తెలిపారు. 2020 నుంచి 3.5 కోట్లకు పైగా యువత (18-28 ఏళ్ల లోపు వారు) EPFOలో రిజిస్టర్ అయ్యారని, ఒక్క 2025 ఆర్థిక సంవత్సరంలోనే 1.13 కోట్ల మంది EPFOలో చేరారని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక భద్రత కార్యక్రమం భారతదేశంలో కొనసాగుతోందని, భారతీయ జనాభాలో 64% మంది సామాజిక భద్రతలో భాగంగా లబ్ధి పొందుతున్నారని, ఉచిత బియ్యం లాంటి పథకాలు దీనికి ఉదాహరణ అని ఆయన అన్నారు. ‘స్టార్టప్ ఇండియా’ ద్వారా యువతను ఉద్యోగ కల్పన కోసం ప్రోత్సహిస్తున్నామని, ఈ పథకం ద్వారా 1.60 లక్షలకు పైగా స్టార్టప్స్ దేశంలో ఏర్పాటయ్యాయని, వీటి ద్వారా 11 ఏళ్లలో 17.6 లక్షల మందికి ఉపాధి లభించిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ స్టార్టప్స్‌లో ఎక్కువ భాగం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటుకావడం వల్ల లోకల్ టాలెంట్‌కు, స్థానిక వ్యాపారాలకు ప్రయోజనం కలుగుతోందని ఆయన అన్నారు.

kishanreddy gave appointment letters in 16th rozgar mela

మహిళా సాధికారతకు ప్రోత్సాహం..16వ రోజ్‌గార్ మేళాలో కేంద్ర మంత్రి

గత 11 ఏళ్లుగా దేశంలో వస్తున్న మార్పుల్లో మహిళలు కీలక భాగస్వాములుగా ఉన్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ముద్ర యోజనలో భాగంగా అందజేసిన 52 కోట్ల రుణాల్లో 68% మహిళలేనని, లఖ్ పతి దీదీ కార్యక్రమంలో భాగంగా కోటి మంది మహిళలు ఏడాదికి రూ. లక్షకు పైగా సంపాదిస్తున్నారని, ఈ సంఖ్యను 3 కోట్లకు పెంచే దిశగా కృషి జరుగుతోందని ఆయన అన్నారు. దీని ఫలితంగా మహిళల లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ (LFPR) 2017-18లో 23% నుంచి 2023-24లో 41.7%కు పెరిగిందని, మహిళల నిరుద్యోగిత రేటు 5.6% నుంచి 3.2%కు తగ్గిందని కిషన్ రెడ్డి వివరించారు. ‘పీఎం విశ్వకర్మ యోజన’ ద్వారా చేతివృత్తుల కళాకారులకు మద్దతుగా పురోగతి వేగంగా ముందుకు సాగుతోందని, ఈ పథకంలో 26 లక్షల మంది నైపుణ్యత కలిగిన కళాకారులు రిజిస్టర్ అయ్యారని ఆయన పేర్కొన్నారు. ‘స్టాండప్ ఇండియా’ పథకం వెనుకబడిన వర్గాలపై సానుకూల ప్రభావం చూపుతోందని, 2016 నుంచి దాదాపు రూ. 61 వేల కోట్లను ఈ పథకంలో భాగంగా మంజూరు చేయగా, వేల మంది చిన్న, మధ్యతరగతి వ్యాపారస్తులకు మేలు జరిగిందని, ఇందులో ఎక్కువ మంది లబ్ధిదారులు వెనుకబడిన వర్గాల వారేనని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సమ్మిళిత అభివృద్ధి ప్రయత్నాల కారణంగా ఆదాయ సమానత్వంలో భారతదేశం ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరుకుందని, ఆర్థిక అసమానతలను చాలా వేగంగా తగ్గించుకునే స్థాయికి చేరుకోగలిగామని కిషన్ రెడ్డి అన్నారు.

16వ రోజ్‌గార్ మేళా.. నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలు

యువత కలలకు, లక్ష్యాలకు మధ్య అవసరమైన నైపుణ్యాభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని కిషన్ రెడ్డి చెప్పారు. ‘ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన’ ద్వారా 1.6 కోట్ల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి జరిగిందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 5జీ, డ్రోన్స్, సైబర్ సెక్యూరిటీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాలకు సంబంధించి 400 కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చామని ఆయన వివరించారు. 8 ప్రాంతీయ భాషల్లో శిక్షణను అందిస్తున్నామని, ఐఐటీలు, ఎన్ఐటీలు, జవహార్ నవోదయ విద్యాలయాల్లో స్కిల్ హబ్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ‘దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన’లో భాగంగా గ్రామీణ యువతకు 2014 నుంచి శిక్షణ అందిస్తున్నామని, 2020-21లో ప్రారంభమైన ‘పీఎం-దక్ష యోజన’లో భాగంగా ఎస్సీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ యువతకు, ఇతర వెనుకబడిన వర్గాల కోసం 112 శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు.

Also Read.. | అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

వచ్చే ఐదేళ్లలో యువతకు సాధికారత కల్పించేందుకు రూ. 2 లక్షల కోట్ల ప్యాకేజీని మోదీ సర్కారు ప్రకటించిందని, ఇందులో 20 లక్షలకు పైగా యువతకు సంప్రదాయ చేతివృత్తులతో పాటు ఆధునిక సాంకేతికతలో శిక్షణ ఇస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. టాప్ 500 కంపెనీల్లో యువతకు పెయిడ్ ఇంటర్న్‌షిప్ ఇస్తున్నామని, దీని ద్వారా కోటి మంది యువతకు లబ్ధి చేకూరనుందని ఆయన అన్నారు. ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహక పథకంలో భాగంగా దాదాపు రూ. లక్ష కోట్లతో వచ్చే రెండేళ్లలో 3.5 కోట్ల మందికి పైగా యువతకు ఉపాధి కల్పించబోతున్నామని, ఇందులో 1.92 కోట్ల మంది లబ్ధిదారులు ఫస్ట్ టైమర్స్ అని పేర్కొన్నారు. వెయ్యి ఐటీఐలను హబ్స్ అండ్ స్పోక్ మోడల్‌లో అప్‌గ్రేడ్ చేస్తున్నామని, 5 ఐటీఐలను నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌గా కన్వర్ట్ చేస్తున్నామని, ఇందులో ఒకటి వెయ్యి కోట్లతో హైదరాబాద్‌లో ఏర్పాటుకానుందని ఆయన ప్రకటించారు. యువతను చేరుకునేందుకు ‘MY Bharat Portal’ను ప్రారంభించామని, దీని ద్వారా నైపుణ్యతతో పాటు కెరీర్ సపోర్ట్, ప్రభుత్వ పథకాలు, నోటిఫికేషన్ల గురించి తెలుస్తుందని ఆయన వివరించారు.

భారతదేశ ఆవిష్కరణలు, రక్షణ రంగం

మోదీ గారి నేతృత్వంలో యువతకు సరైన విద్యనందించడం, నైపుణ్యాభివృద్ధి, వారిలో సృజనాత్మకతను, పరిశోధనలు చేసేలా ప్రోత్సహిస్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు. దాదాపు ప్రతి వారం దేశంలో ఒక కొత్త విశ్వవిద్యాలయం, ప్రతిరోజూ రెండు కొత్త కాలేజీలు ఏర్పాటవుతున్నాయని ఆయన తెలిపారు. భారతదేశం ప్రపంచంలోనే అందుబాటు ధరల్లో ఉన్నటువంటి మేధోశక్తి గల దేశంగా ప్రత్యేకతను సంపాదించుకుందని, 1,700 కోట్ల గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ పనిచేస్తున్నాయని, వీటి ద్వారా 20 లక్షలకు పైగా స్కిల్డ్ ఇండియన్ ప్రొఫెషనల్స్‌కు ఉపాధి లభిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. డిజిటల్ ఇన్నొవేషన్, టెక్నాలజీ అడాప్షన్‌లో భారతదేశం ప్రపంచంలోనే ముందువరుసలో ఉందని, ఏఐ అడాప్షన్‌లో అత్యంత వృద్ధిరేటు, ఫిన్ టెక్ అడాప్షన్‌లో మొదటి ర్యాంకు, స్మార్ట్ ఫోన్ డేటా వినియోగంలో మొదటి ర్యాంకు, రెండో అతిపెద్ద ఇంటర్నెట్ వినియోగదారుగా ఉందని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సగానికి పైగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ భారతదేశంలోనే జరుగుతున్నాయని, అందుకే భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా, రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీలో నాలుగో ర్యాంకులో, రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారుగా, అతిపెద్ద లోకోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్‌గా ఉందని కిషన్ రెడ్డి వివరించారు.

‘మేకిన్ ఇండియా’ కారణంగా రక్షణ రంగ ఉత్పత్తుల్లో ఆత్మనిర్భరత సాధిస్తున్నామని, స్వదేశీ సాంకేతికతతో యుద్ధ ట్యాంకులు, మిసైళ్లు, ఫైటర్ జెట్స్, ఆర్టిలరీ, సబ్ మెరైన్స్ వంటి వాటిని దేశీయంగా ఉత్పత్తి చేసుకుంటున్నామని ఆయన అన్నారు. హైదరాబాద్, పూణే, జబల్‌పూర్, బెంగళూరు, నాగ్‌పూర్, కొచ్చి వంటి నగరాల్లో అత్యంత ఆధునిక ఆయుధాల ఉత్పత్తి వేగంగా జరుగుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

16వ రోజ్‌గార్ మేళా.. యువతకు పిలుపు, భవిష్యత్ దృష్టి

చివరగా, కిషన్ రెడ్డి ఉద్యోగాలు పొందిన యువతనుద్దేశించి మాట్లాడుతూ, వారు ఈ స్థాయికి రావడానికి కారణమైన తల్లిదండ్రులను, గురువులను ఎప్పటికీ మర్చిపోవద్దని, దేశానికి సేవ చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు, యువత చిత్తశుద్ధి, అంకితభావం తోడైతే, భారతదేశ ప్రగతిని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని ఆయన అన్నారు. అందుకే అందరి సహకారంతో, యువతకు అండగా నిలుస్తూ ముందుకు నడిచేందుకు మోదీ సర్కారు సిద్ధంగా ఉందని, కలిసి నవభారతాన్ని నిర్మిద్దామని, ప్రపంచం మనవైపు తలెత్తి చూసేలా చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.

Share the post

Also Read..