గత నాలుగైదు నెలలుగా దోబూచులాడుతున్న అంశానికి తెరపడినట్టు తెలుస్తోంది. వైఎస్సార్టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం ఇక లేదని తెలుస్తోంది. YSRTP అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీకి విలీనంపై ఏదో ఒక నిర్ణయం తెలుపాలని విధించిన డెడ్‌లైన్ ముగిసింది. గడువు దాటినా కూడా విలీనంపై కాంగ్రెస్ స్పందించకపోవడంతో, ఇక ఒంటరిగానే బరిలోకి దిగాలనే నిర్ణయానికి షర్మిల వచ్చినట్లు తెలుస్తోంది.
YSRTP పేరుతో తెలంగాణలో పార్టీని స్థాపించిన షర్మిల నిన్న మొన్నటి వరకూ తెలంగాణ రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించారు. జిల్లాల్లో పాదయాత్రలు చేస్తూ ప్రజల్లోఆదరణ పెంచుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఫలితాల తర్వాత పుంజుకోవడం ప్రారంభం అయింది. కర్ణాటక ఫలితాల ప్రభావం ఇక్కడ పని చేస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో వైఎస్ఆర్ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యంతో YSRTPని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనే అంశం తెరపైకి వచ్చింది. ఇక విలీనం లాంఛనమే అనుకున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎలాంటి స్పందన రాక పోవడంతో.. విలీనంపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీకి సెప్టెంబర్ 30 వరకు షర్మిల డెడ్‌లైన్ విధించారు. షర్మిల పార్టీ విలీనం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస నేతలకు ఇష్టం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఇష్టం లేదని సమాచారం.
కాంగ్రెస్ పార్టీ విలీనంపై స్పందించకపోవడంతో షర్మిల కీలక నిర్ణయం తీసున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో 119 నియోజక వర్గాల్లో పోటీ చేస్తారని టాక్. ఖమ్మం జిల్లా పాలేరు నుండి షర్మిల పోటీ చేస్తారని ఆమె సన్నిహితులు అంటున్నారు. YSRTP తరపున పోటీ చేయాలని ఆసక్తి ఉన్న నేతల నుడి దరఖాస్తులు స్వీకరిస్తారని సమాచారం.