మేడ్చల్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్ధిగా యువ జర్నలిస్ట్ సమైక్ సరిళ్ల నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికలంటే కేవలం డబ్బుంటే సరిపోతుందనే పరిస్థితులు ప్రస్తుతం దేశంలో ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా డబ్బు, మద్యం, ధనవంతులు మాత్రమే రాజకీయాలు చేస్తున్న ప్రస్తుత పరిస్థితులలో.. స్వచ్చమైన రాజకీయలకు తన నామినేషన్ నాంది కావాలని ఆకాంక్షించారు. చదువుకున్న యువత ఎవ్వరికీ భయపడకుండా స్వతంత్రంగా రాజకీయాల్లోకి రావలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారి తాను ఎన్నికల్లో పోటీ చెయ్యాలని నిర్ణయించుకున్నానని సమైక్ తెలిపారు.
కీసర ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ వేయడానికి వచ్చిన తనకు అవమానం జరిగిందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నామినేషన్ వేసే అభ్యర్థితోపాటు నలుగురు సభ్యులు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించవచ్చన్న నియమం ఉన్నప్పటికీ.. తనతో ఒక్కరిని కూడా లోపలికి అనుమతించలేదని వాపోయారు. పెద్దపెద్ద నాయకులు తమ మంది, మార్బలంతో, ఫోటోలు వీడియోలు తీసుకుంటుంటే, కనీసం తనని ఒక్క ఫోటో కూడా దిగనివ్వలేదని.. కుటుంబంతో నామినేషన్ వేద్దామనుకొని ఎంతో సంతోషంగా కార్యాలయానికి వచ్చిన తనికి ఎన్నికల సిబ్బంది ద్వారా అవమానం జరిగిందని తీవ్ర అసంతృప్తి చెందారు. అగ్ర నాయకులను ఒకలా, దళిత వర్గానికి చెందిన తనను మరోలా చూశారని కార్యాలయం బయట కన్నీరు పెట్టుకున్నారు. అయినా కూడా పట్టుదలతో ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు. స్వచ్చమైన రాజకీయాలు రావాలని.. డబ్బులతో చేసే రాజకీయాలు అంతం కావాలని సమైక్ తన నామినేషన ద్వారా నిరసన వ్యక్తం చేయడాన్ని పలువురు అభినందిస్తున్నారు.