తెలంగాణలో హ్యాట్రిక్ విజయం దిశగా బిఆర్ఎస్ పార్టీ (BRS Party) పావులు కదుపుతోంది. అందులో భాగంగానే కాంగ్రెస్, బీజేపీ పార్టీల టిక్కెట్లు ఆశించి దక్కని నేతలనుబిఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయం నుండే బిఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించింది.శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ బిఆర్ఎస్ పార్టీలో చేరారు. దాసోజు శ్రవణ్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయగా ఆ ఫైల్ ను గవర్నర్ తిరస్కరించారు.
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యాక బిఆర్ఎస్ పార్టీ చేరికల విషయంలో మరింత దూకుడు పెంచింది. మంత్రులు హరీష్ రావు, కేటీఆర్,ఇతర బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో వున్న అసంతృప్త నేతలతో చర్చలు జరిపి బిఆర్ఎస్ పార్టీలో చేరే విధంగా చర్చలు జరుపుతున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జనగామ టిక్కెట్ ఆశించి.. రాదేనని ముందుగానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.భువనగిరి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఆశించి జిట్టా బాలక్రిష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకు ముందు కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లో చేరిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో జిట్టా బాలక్రిష్ణా రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. గద్వాల టిక్కెట్ రాకపోవడంతో డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మెదక్ అసెంబ్లీ టిక్కెట్ ఆశించి దక్కకపోవడంతో డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక తెలంగాణ ఉద్యమంలో తమ పాటల ద్వారా క్రియాశీలక పాత్ర పోషించిన ఏపూరి సోమన్న బిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మానకొండూరు బీజేపీ టిక్కెట్ ఆశించిరాకపోవడంతో దరువు ఎల్లన్న బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేయాలని భావించారు. కానీ మైనంపల్లి హనుమంతరావుకు కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వడంతో నందికంటి శ్రీధర్ బిఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో బిఆర్ఎస్ పార్టీ వెంటనే నందికంటికి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం కల్పించారు.కాంగ్రెస్ పార్టీలో ఉప్పల్ టిక్కెట్ ఆశించిన సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి అవకాశం రాకపోవడంతో తన సతీమణి కార్పొరేటర్ శిరీషా రెడ్డితో కలిసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ సైతం బిఆర్ఎస్ లో చేరారు. నిర్మల్ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు, గత ఎన్నికల్లో ముధోల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయిన కె.రమాదేవి గులాబీ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ టిక్కెట్ ఆశించి రాకపోవడంతో మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డి తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు.
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టిక్కెట్ రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు. తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. విష్ణువర్ధన్ రెడ్డికి గోషామహల్ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించే అవకాశం వున్నట్లుగా గులాబీ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ టిక్కెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. టీడీపీ నుండి మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి పి.చంద్రశేఖర్ బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఇతర పార్టీల్లో బలమైన నేతలను బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెక్ పెట్టాలనే వ్యూహం ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మేరకు పని చేస్తుందనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.