ఢిల్లీలో దాదాపు 27 సంవత్సరాల తరువాత బీజేపీ విజయబావుటా ఎగురవేసింది. డిల్లీలో గెలుపుతో బీజేపీకి ఇక ఎదురులేదని మరోసారి రుజువైందని పార్టీ నేతలు అంటున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి సాద్యమని ప్రజలు తమకు పట్టం కట్టారని అంటున్నారు. దేశంలోని బేజేపీ యేతర రాష్ట్రాలకంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాలలోనే అభివృద్ధి జరుగుతుందని బీజేపీ అంటుంది.
ఇప్పటికే మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీలో అనుకున్న ఫలితాలను సాధించింది. కర్ణాటకలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటినుండే ప్రయత్నాలు చేస్తోంది. తమిళనాడులో ఇప్పుడిప్పుడే ఎదుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ తో కలిసి అధికారంలో కొనసాగుతోంది. ఇక తెలంగాణలో అధికారంలోకి రావాలని వ్యూహాలకు పదును పెడుతోంది. 2028లో తెలంగాణలో అధికారలోకి వచ్చేది తమ పార్టీయేనని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ బీజేపీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహం నింపాయి. అయితే, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అంత తేలిక కాదు. ఎందుకంటే, ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది.. బలంగా ఉంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా బలంగా ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఏడాదిగా కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీలు తెలంగాణను అవినీతిమయం చేశాయని బీజేపీ అంటుంది. అందుకే, ఒక్క చాన్స్ బీజేపీకి ఇవ్వాలని కోరుతున్నారు. తెలంగాణలో కూడా ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని చెబుతున్నారు.
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్ధానాలను కమలం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు టీచర్స్ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెలలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఎట్టి పరిస్ధితుల్లో మూడు స్థానాలను బీజేపీ గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. అన్నిపార్టీల కంటే ముందుగానే అభ్యర్ధులను ప్రకటించడం..అభ్యర్ధులు ప్రచారంలో దూసుకుపోతుండడం.. బీజేపీకి కలిసి వస్తాయని అంటున్నారు. ఢిల్లీ ఫలితాల ప్రభావం కూడా ఉంటుందని పార్టీనేతలు అభిప్రాయ పడుతున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల్లో బీజేపీకి 4 గురు ఎంపీలు, 7గురు ఎమ్మెల్యేలు ఉండడం అదనపు బలంగా పార్టీనేతలు భావిస్తున్నారు. జాతీయ నాయకులతో సైతం ప్రచారం చేయించేందుకు బీజేపీ సమాయత్తం అవుతుంది. ఆతర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే ఊపుతో ముందుకు వెళ్తామని పార్టీ నేతలు అంటున్నారు. ఏది ఏమయినా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.