తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం అనూహ్య వృద్ధిని సాధిస్తోంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో భూముల విలువ పెరగనుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ భూముల ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. పల్లెల్లో కూడా ఎకరం భూమి లక్షల్లో పలుకుతోంది. అయితే, ప్రభుత్వ రికార్డుల్లో మాత్రం ఈ భూముల విలువలు చాలా తక్కువగా నమోదై ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిపోతోందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించి, ప్రభుత్వ ఖజానాకు మరింత ఆదాయాన్ని సమకూర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది.
తెలంగాణలో భూముల విలువ పెంచడానికి కారణాలు
తెలంగాణ ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా పుంజుకుంది. పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడంతో భూముల ధరలు ఊహించని విధంగా పెరిగాయి. కానీ, చాలా కాలంగా ప్రభుత్వ రికార్డుల్లోని భూముల రిజిస్ట్రేషన్ విలువలు పాత ధరల ప్రకారమే ఉన్నాయి. ఈ తక్కువ విలువలు రిజిస్ట్రేషన్ల సమయంలో ప్రభుత్వానికి రావాల్సిన స్టాంప్ డ్యూటీ, ఇతర ఫీజుల రూపంలో భారీగా నష్టాన్ని కలిగిస్తున్నాయని ప్రభుత్వం భావిస్తుంది. భూముల మార్కెట్ విలువలకు, ప్రభుత్వ రికార్డుల్లోని రిజిస్ట్రేషన్ విలువలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని తగ్గించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచుకునేందుకు సవరణ చేయాలని ప్రభుత్వం ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆద్వర్యంలో సమీక్ష
ఈ అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఇటీవల జరిగిన ఆర్ధిక వనరుల సమీకరణ సమావేశంలో తెలంగాణలో భూముల విలువ పెంపుపై విస్తృతంగా చర్చించారు. భూముల విలువ పెంపుపై సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. దీనితో రాష్ట్ర స్థాయిలో మార్కెట్ విలువల కేంద్ర మదింపు సలహా కమిటీ (Central Valuation Advisory Committee – CVAC) రంగంలోకి దిగింది. ఈ కమిటీ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ చైర్మన్‌గా, జాయింట్ ఐజీ కన్వీనర్‌గా వ్యవహరిస్తుంది. సీసీఎల్‌ఏ కార్యదర్శి, ఇతర శాఖల అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు.
గతంలోనే ప్రభుత్వం ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా తెలంగాణలో భూముల విలువ పెంపుపై అధ్యయనం చేయించింది. ఆ నివేదిక ఆధారంగా ఆదాయాన్ని పెంచే మార్గాలను పరిశీలించాలని రిజిస్ట్రేషన్ శాఖకు సూచించారు. పలు దఫాలుగా సమావేశమైన అధికారులు తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేశారు. రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ విలువ పెంపుపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. తాజాగా నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో పెంపు ఖాయమనే చర్చ జరుగుతోంది.
Also Read…| యోగా దినోత్సవం వేడుకలకు విశాఖకు ప్రధాని మోడీ
ఇటీవల రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో సీవీఏసీ సమావేశమై మార్కెట్ విలువలపై కీలక చర్చలు జరిపింది. త్వరలో మరోసారి సమావేశమై పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. భూముల విలువలను ఎంత పెంచాలనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని, అయితే ఈ పెంపు శాస్త్రీయంగా ఉండాలని థర్డ్ పార్టీ ఏజెన్సీ తన నివేదికలో స్పష్టం చేసింది.
పారదర్శకత పెరుగుతుందా?
అధికారులు తయారు చేసిన నివేదిక శాస్త్రీయంగా ఉందా, భూముల వాస్తవ ధరలకు, పుస్తక విలువలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఎంత, దానిని సవరించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, శాస్త్రీయంగా పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు వంటి అంశాలపై ఏజెన్సీ తన అభిప్రాయాన్ని తెలియజేసింది. కేవలం ఆదాయాన్ని పెంచడమే కాకుండా, భూముల మార్కెట్ విలువలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా తీసుకురావడంలో ఈ నిర్ణయం సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ సవరణ ద్వారా భూ లావాదేవీల్లో పారదర్శకత పెరుగుతుందని, బ్లాక్ మనీ చెలామణి తగ్గుతుందని కూడా అంచనా వేస్తున్నారు.
ఈ భూముల మార్కెట్ విలువలు పెంచడం వల్ల ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరడమే కాకుండా, భూముల వాస్తవ మార్కెట్ విలువలు ప్రజలకు మరింత స్పష్టంగా తెలుస్తాయి. ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.