తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..? రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ల పాలన చూశారు.. ఇక బీజేపీనే ఆల్టర్నేటివ్ అని ఎందుకు అంటున్నారు..? సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.. సంక్రాంతి తర్వాత రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడు రానున్నారా.. ?
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ కసరత్తు చేస్తుంది. అందుకు కావలసింది బలమైన క్యాడర్ అని బీజేపీ గుర్తించింది. అందులో భాగంగానే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీకి గతంలో ఎన్నడూ లేని సభ్యత్వాలు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో 40 లక్షల సభ్యత్వ నమోదు జరిగింది. అందులో 30 వేలమంది క్రియాశీల సభ్యత్వాలు నమోదయ్యాయి. దానికితోడు ఇప్పటికే సంస్థాగతంగా బూత్ కమిటీల ఎన్నికలు పూర్తి చేసుకుంది. ఈ నెల 28లోగా క్రియాశీల సభ్యత్వం, పోలింగ్ బూత్ కమిటీల ఎన్నికలు పూర్తి చేయాలని చూస్తున్నారు.
జనవరి 10 వరకు మండల స్థాయి కమిటీల నియామకం.. అనంతరం జిల్లా కమిటీల ఎన్నికలను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలతో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి సునీల్ బన్సల్ భేటీ అయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానినికి రాష్ట్రంలోని బీజేపీ జిల్లాల అధ్యక్షులు, రిటర్నింగ్ అధికారులు, జోనల్ పరిశీలకులు, జిల్లా సభ్యత్వ నమోదు ఇన్‌చార్జులు, ఎన్నికల అధికారులు హాజరయ్యారు. సమావేశంలో సంస్థాగత ఎన్నికలు, తాజా రాజకీయాలు, భవిష్యత్ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి వరకు మండల, జిల్లా అధ్యక్షుల ఎన్నికలు పూర్తి చేసేందుకు సమాయత్తం అవుతున్నారు.
తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం
సంక్రాంతి తర్వాత బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడు ఎన్నిక ప్రక్రియ జరుగనుంది. ఇక అప్పటినుండి పార్టీని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేలా ప్రణాళికలు సిద్దం చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే పదవుల కోసం లాబీయింగ్ జరుగుతున్నట్టు సమాచారం. పార్టీ పదవులు పార్టీకోసం పనిచేసేవారికే ఇవ్వాలని అధిష్టానం భావిస్తుంది. తద్వారా కేడర్ పార్టీకోసం మరింత కష్టపడి చేస్తుందని పార్టీ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా… ఇచ్చిన హామీలు అమలు చేయడంలేదని కాషాయ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు ప్రజల తరపున బీజేపీ పోరాటం చేస్తుందని పార్టీ నేతలు అంటున్నారు.
మొత్తానికి సంక్రాంతి తరువాత పార్టీకి కొత్త అధ్యక్షుడు రావడం వల్ల పార్టీకి మరింత జోష్ పెరుగుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు రికార్డు స్ధాయిలో సభ్యత్వ నమోదు పూర్తిచేయడం పార్టీ బలోపేతానికి దోహదం చేస్తాయని అనుకుంటున్నారు. సంక్రాంతి ముందు ఒక లెక్క.. సంక్రాంతి తర్వాత ఒక లెక్క.. అని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. చూడాలి మరి పార్టీలో ఎలాంటి మార్పులు జరుగుతాయి.. తద్వారా తెలంగాణలో పార్టీ ఏమేరకు బలపడుతుందో తెలియాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే..