జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. హెల్త్ కార్డుల విషయంలో త్వరలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులతో సమీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు. ప్రజలు. జర్నలిస్టుల ఆరోగ్యం విషయంలో రాజీపడేది లేదన్నారు. అందుకే ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచినట్టు వివరించారు.
శుక్రవారం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని మంత్రుల నివాససముదాయంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) ప్రతినిధి బృందం మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా దీర్ఘకాలికంగా హెల్త్ కార్డులు సరిగ్గా పనిచేయడం లేదని మంత్రి దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నా.. ప్రయివేటు, కార్పొరేట్ ఆసుపత్రులు పట్టించుకోవడం లేదని గుర్తుచేశారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం రూపొందిస్తున్న కొత్త ఆరోగ్య పథకాన్ని జర్నలిస్టులకూ వర్తింపజేయాలని కోరారు. ఉద్యోగుల నుంచి వసూలు చేసే ఒక శాతం కంట్రిబ్యూషన్ను జర్నలిస్టులకు సంబంధించి ప్రభుత్వమే భరించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన మంత్రి ఈ విషయాన్ని పరిశీలిస్తామని ఫెడరేషన్ నాయకత్వానికి హామీ ఇచ్చారు. త్వరలో ఆరోగ్యశ్రీ అధికారులతో జర్నలిస్టుల విషయమై సమీక్ష చేసి నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
మంత్రిని కలిసిన వారిలో టీడబ్ల్యూజేఎఫ్ (TELANGANA WORKING JOURNALIST’S FEDERATION) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు గుడిగ రఘు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పి. విజయ, హెచ్ఐయూజే అధ్యక్షులు బి. అరుణ్కుమార్, బి. జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.