బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (padi kaushik reddy), ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ (arekapudi gandhi)ల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేందుకే ఆంధ్రా, తెలంగాణ అంటూ మాట్లాడుతున్నారని అరికెపూడి గాంధీ మండిపడ్డారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తన ఇంటికి వచ్చి జెండా ఎగురవేస్తానని పాడి కౌశిక్ రెడ్డి చెప్పారని, కానీ ప్రాంతీయ విభేదాలు తీసుకువచ్చే వ్యక్తితో తాను కలిస్తే తాను కూడా కౌశిక్ రెడ్డి లాంటి వాడినని సమాజం భావిస్తుందన్నారు. అయినప్పటికీ ఆయనను ఇంటికి ఆహ్వానించానని, కానీ ఆయన రాలేదని అన్నారు. తానే స్వయంగా అతని ఇంటికి వెళితే దాడి చేశారని ఆరోపిస్తున్నారని తెలిపారు. కౌశిక్ రెడ్డి నిక్కర్ వేసుకోని రోజుల్లో తాను హైదరాబాద్ వచ్చానని.. జూనియర్ ఎమ్మెల్యే తనలాంటి సీనియర్ ఎమ్మెల్యేపై ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదని అన్నారు. తనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్‌లోయ ఇతర నాయకులే లేరా? అని ప్రశ్నించారు. తనతో మాట్లాడేందుకు కౌశిక్ రెడ్డికి కొత్తగా పదవి ఇచ్చిందా? అని ఎద్దేవా చేశారు. గతంలో గవర్నర్ పైన చేసిన వ్యాఖ్యలు.. నిన్న మహిళలపై చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్రాప్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పడ్డారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్ అభివృద్ధి జరగకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అరికెపూడి గాంధీయే తన పట్ల ఇష్టారీతిగా మాట్లాడాడని.. తాను సెటిలర్లను కించపరిచినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా పేరుతో కూల్చివేతలతో నగర ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని అన్నారు. గత పదేళ్లలో కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా పని చేస్తుందని మండిపడ్డారు. ఇక నుండి రేవంత్ రెడ్డి వర్సెస్ కౌశిక్ రెడ్డి అని వ్యాఖ్యానించారు.