తెలంగాణ రాష్ట్ర శాసన సభకు శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సహకారాన్ని రాజకీయ పార్టీలకు అందజేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ హామీ ఇచ్చారు. పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు సోషల్ మీడియాతో సహా ఏ అంశం పైన అయినా చేసే సహేతుకమైన ప్రతి ఫిర్యాదును సానుకూలంగా పరిశీలిస్తామని కూడా ఆయన వారికి హామీ ఇచ్చారు. రాజకీయ ఫిర్యాదులపై సమయం, శ్రమను ఆదా చేయడంతోపాటూ, వీలైనంత త్వరగా న్యాయం అందించే దిశగా స్థానికంగా వారి శక్తి సామర్ధ్యాలమేర సహకరించాలని డిఈఓలకు, ఈఓలకు ఆదేశాలు జారీ చేస్తామని ఆయన చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల తేదీ సమీపిస్తున్న తరుణంలో పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయపార్టీలు పాటించాల్సిన నమూనా ప్రవర్తనా నియమావళి, స్టార్ క్యాంపైనర్లు, మేనిఫెస్టోలు, నామినేషన్లు, అఫిడవిట్లు, ప్రకటనల ముందస్తు ధృవీకరణలకు సంబంధించిన నియమ నిబంధనలు, అధునాతన యాప్‌ల వంటి సాంకేతిక సౌకర్యాలు, ఓటరు జాబితాల తాజా స్థితి, వాటిలో మార్పులు చేర్పులు (ఇప్పటి వరకు14.99 లక్షల సవరణలు జరిగాయి), కొత్త ఓటర్ల నమోదు వంటి అంశాల పై మరింత అవగాహన కలిగించడానికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని తన కార్యాలయంలో వికాస్ రాజ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు షెడ్యూలు విడుదల అయిన తరువాత ఇప్పటి వరకు జరిగిన అన్ని తాజా పరిణామాలను ఆయన వారికి వివరించారు. దాదాపు 20 మంది రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరై పలు సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను నివృత్తి చేయడంలో అదనపు సిఈఓ లోకేష్ కుమార్, జాయింట్ సిఈఓ సర్ఫరాజ్ అహ్మద్, డిప్యూటీ సిఇఓ సత్యవాణి తదితర ఉన్నతాధికారులు ఆయనకు సహకరించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడానికి రాజకీయ పార్టీలతో ఈ నెల 14 వరకు 2100కు పైగా సమావేశాలు నిర్వహించామని వికాస్ రాజ్ తెలుపుతూ డీఈవోలు, ఈఆర్వోలు ప్రతి వారం వారితో నిర్వహించిన సమావేశాలు కూడా దీనిలో ఉన్నాయని వివరించారు.
అక్టోబర్ చివరి నాటికి ఓటరు కార్డుల పంపిణీ పూర్తి చేస్తాం
ఈ ఏడాది జనవరి 5వ తేదీ నుంచి 27.5 లక్షలకు పైగా ఓటరు కార్డులను ముద్రించి ఓటర్లకు పంపిణీ చేసామనీ, ఈ నెలాఖరు లోగా మిగిలిన ఓటరు కార్డుల ముద్రణ పూర్తి చేసి ఓటర్లకు అందజేస్తామని జాయింట్ సీఈవో సమావేశానికి తెలియజేశారు. ఓటర్లు కూడా తమంతట తాముగా ఈ-ఎపిక్ కార్డులను ఓటర్ల సేవా పోర్టల్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ఈ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోవాలని అనుకునే కొత్త ఓటర్ల నమోదుకు ఈ నెలాఖరు వరకు గడువు ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
