తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ జండాను ఎగురవేసి, అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభకాంక్షలు తెలియజేశారు.గత రెండు సంవత్సరాలుగా భారత ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు.
ఈ ఏడాది కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. నియంతృత్వ నిజాం నుండి తెలంగాణ ప్రజలకు విమోచనం లభించిన రోజు ఈరోజు అని అన్నారు. వేలాది మంది ప్రజలు చేసిన వీరోచిత పోరాటాలు, అనేక త్యాగాలు, ఆత్మబలిదానాలతో తెలంగాణకు స్వాతంత్ర్యం లభించిందని పేర్కొన్నారు.
దేశానికంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధిస్తే.. మన తెలంగాణ రాష్ట్రానికి 13 నెలలు ఆలస్యంగా 1948 సెప్టెంబరు 17న స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. నిజాం నవాబు పాలన నుంచి విముక్తి కోసం తెలంగాణ ప్రజలు వీరోచిత పోరాటం చేశారని గుర్తుచేశారు.నిజాం సైన్యం,రజాకార్లు గ్రామాల్లోకి వెళ్లి స్త్రీల మీద అత్యాచారాలు, లూటీలు చేసి అరాచకాలకు పాల్పడ్డారన్నారు. భారత ప్రభుత్వంలో అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో హైదరాబాద్ పై సైనిక చర్య చేపట్టి, నిజాం సైన్యాన్ని ఓడించి, తెలంగాణలో మూడు రంగుల జెండాను ఎగురవేశారని అన్నారు. నేటి సెప్టెంబరు 17 చాలా ప్రత్యేకమైనదని అన్నారు. విశ్వకర్మ జయంతి, వినాయక నిమజ్జన మహోత్సవం, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం అన్నీ ఒకే రోజు జరుపుకుకుంటున్నామని, అందుకే ఈరోజు పవిత్రమైన రోజు అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు రజాకార్ల వారసత్వంగా ఉన్న మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తున్నాయని విమర్శించారు. మజ్లిస్ పార్టీ అడుగులకు మడుగులొత్తుతూ.. దివాళాకోరు రాజకీయాలతో తెలంగాణకు స్వాతంత్య్రం లభించిన సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాలను నిర్వహించకుండా తెలంగాణ ప్రజలను ఈపార్టీలు మోసం చేస్తున్నాయని ద్వజమెత్తారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల చర్యలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని కిషన్ రెడ్డి కోరారు.