తెలంగాణలో వరదలవల్ల నష్టం సంభవించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు తప్పకుండా సాయం అందిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్ఫష్టం చేశారు. ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ప్రధాని ఆదేశాలతో శివరాజ్ సింగ్ ఆధ్వర్యంలో తాము రాష్ట్ర మంత్రులతో కలిసి ఖమ్మంలో పర్యటించామన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే సచివాలయంలో డోమ్ లను కూల్చేస్తామని గతంలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని చెప్పిన బండి సంజయ్… 9 అంతస్తుల సచివాలయంలో 3 అంతస్తుల మేర డోమ్ లను నిర్మించడమేందని ప్రశ్నించారు. అధికారులకు, సిబ్బందికి సరైన స్థలం, సదుపాయాలు కూడా సచివాలయంలో లేవని చెప్పారు. కేసీఆర్ నవగ్రహ యాగం చేయడంపైనా తనదైన శైలిలో బండి సంజయ్ స్పందించారు. ‘‘కేసీఆర్ దశమ గ్రహం. తెలంగాణ ప్రజలకు దశమ గ్రహం పీడ విరగడమైంది. అయినా పదేళ్లు కేసీఆర్ సహా ఆయన కుటుంబమంతా అధికారం అనుభవించింది కదా.. ఇంకా దేనికోసం నవగ్రహం యాగం చేస్తున్నట్లు’’అని వ్యాఖ్యానించారు.