కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం తెలంగాణ డీజీపీ జితేందర్ కు ఫోన్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైనూర్ లో జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు 31న జైనూర్ మండలానికి చెందిన 45 ఏళ్ల ఆదివాసీ మహిళపై ఆటోడ్రైవర్ షేక్ మగ్దూం లైంగిక దాడికి యత్నించడంతో పాటు తీవ్రంగా గాయపర్చినట్లు, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో, బండి సంజయ్ డీజీపీతో ఫోన్ లో మాట్లాడారు. ఈ కేసు గురించి, ఘటన జరిగిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
నిందితునికి కఠిన శిక్ష పడేలా చూడాలని.. మహిళలపై హత్య మరియు అత్యాచారాలు చేయువారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ కోరారు. అలాగే, శాంతిభద్రతలను కాపాడటానికి, ఆదివాసీ హక్కులను రక్షించటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.