తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రడ్డి ఆద్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గాంధీ భవన్ లో ఘనంగా జరిగాయి. దేశ ప్రజలందరికీ ఆయన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలకు స్వాతంత్ర ఫలాలు అందించాలని లక్షలాది మంది కాంగ్రెస్ శ్రేణులు నాడు ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఈ రోజు మనం అందరమూ ముగ్గరు వ్యక్తులను స్మరించుకోవాలని అన్నారు. వారిలో.. అహింసా మార్గంలో పోరాటం చేయవచ్చని మహాత్మ గాంధీ, దేశంలో ఓటును ఆయుధంగా మార్చి ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించిన అంబేద్కర్, కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న దేశానికి సంక్షేమ ఫలాలు అందించిన మహా నేత జవహర్ లాల్ నెహ్రూ అని రేవంత్ రెడ్డి తెలిపారు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన వీర వనిత ఇందిరా గాంధీ అని అన్నారు. భారత దేశంలో ఐటీ రంగం కోసం ప్రధాని రాజీవ్ గాంధీ కృషి చేశారని ఆయన తెలిపారు.
అదేవిధంగా దేశాన్ని ఆర్థికంగా పురోగతివైపు నడిపించిన పీవీ నరసంహా రావు , మన్మోహన్ సింగ్ సేవలు మరచిపోలేనివి అని అన్నారు. దేశంలో విభజించు పాలించు విధానాన్ని ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తోందని అన్నారు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని రేవంత్ విమర్శించారు. దేశంలో విద్వేషాన్ని వీడాలని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని అన్నారు. రాహుల్ గాంధీ ఆ యాత్ర ద్వారా దేశ ప్రజలలో స్ఫూర్తి నింపారని అన్నారు. నెహ్రూ నుండి మన్మోహన్ వరకు దేశాన్ని పాలించిన ప్రధానులు 60 ఏళ్లలో చేసిన అప్పుకంటే ఈ ఎనిమిదేళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ రెండింతలు ఎక్కువ అప్పు చేశారని విమర్శించారు. ఈ రోజు దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందన్నారు. బీజేపీ వస్తే జీడీపీ పెరుగుతుందన్నారు. కానీ పెరిగింది జీడీపీ కాదని.. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయని తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. మోడీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆరోపంచారు.
ఒక వైపు మణిపూర్ మండుతుంటే మోడీ, అమిత్ షా కర్ణాటకలో ఓట్ల వేటకు వెళ్లారని విమర్శించారు. మణిపూర్ లో సైన్యాన్ని పంపి నిలువరించాల్సింది పోయి… కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ఈడీ, సీబీఐ ని పంపించారు. నియంతలకంటే దారుణంగా ప్రధాని వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. ఇండియా కూటమి ద్వారానే మళ్లీ దేశానికి మంచిరోజులు వస్తాయని అన్నారు.
ఆ భయంతోనే కేసీఆర్ ఇవన్నీ చేస్తున్నారు
కాంగ్రెస్ హామీలు ఇస్తుంటే.. ఓటమి భయంతోనే కేసీఆర్ రుణమాఫీ, నోటిఫికేషన్లు, డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తానంటూ మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు జరుగుతున్నదంటే అది కాంగ్రెస్ పోరాటాల వల్లే అని తెలిపారు. ఇక కేసీఆర్ ఏది చేసినా ప్రజలు నమ్మరన్నారు. బీఆరెస్ ప్రభుత్వం హడావిడిగా అమ్ముతున్న భూములపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సమీక్షిస్తామని తెలిపారు. కేసీఆర్ కుటుంబం లక్షకోట్ల అవినీతికి పాల్పడిందని, హైదరాబాద్ చుట్టుపక్కల 10వేల ఎకరాలు దోచుకుందని ఆరోపించారు. ఇంకో వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తుంది.. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తుంది అని పీసీసీ చీఫ్ అన్నారు.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఖాళీగా ఉన్న 2లక్షల ప్రభత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకుంటామన్నారు. ఇంటి నిర్మాణానికి ప్రతీ పేదవాడికి రూ.5లక్షల ఆర్ధిక సాహాయం అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.
తిరగబడదాం… తరిమికొడదాం
రాష్ట్రంలోని ప్రతీ గడపకు వెళ్లి.. ప్రతీ తలుపు తడదామని.. ఇక నుండీ ప్రజల్లోనే ఉండాలని కార్యకర్తలకు, నాయకులకు రేవంత్ సూచించారు. తిరగబడదాం… తరిమికొడదాం అనే నినాదం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని.. తద్వారా.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని.. దానికోసం అందరూ కలిసి కట్టుగా పని చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.
ప్రపంచ చరిత్రలో యుద్ధం లేకండా విముక్తి లేదు. రక్తపాతం లేకుండా స్వాతంత్ర్యం లేదు.
— Revanth Reddy (@revanth_anumula) August 15, 2023
కానీ అహింస అనే ఆయుధంతో రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన భారతదేశం ప్రపంచానికే ఆదర్శం.
అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. #IndependenceDay2023 pic.twitter.com/HehNKwZC8T