Sunday, March 23, 2025
HomeNewsTelanganaRevanth Reddy: వారి వల్లనే కేసీఆర్ ఎంపీగా గెలిచాడు.. కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

Revanth Reddy: వారి వల్లనే కేసీఆర్ ఎంపీగా గెలిచాడు.. కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

కేసీఆర్ పాలనలో పాలమూరు నుండి వలసలు ఆగలేదని, అభివృద్ధి జరగలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పూర్తి కాకుండానే ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభిస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ప్రాజెక్టు మొత్తం 31 పంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. కేవలం ఒక్క పంప్ ను ప్రారంభించి ప్రాజెక్టు పూర్తి చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. సోమవారం గాంధీభవన్ లో దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. “గతంలో నేను ఎమ్మెల్సీగా గెలిచేందుకు దయాకర్ రెడ్డిగారు అండగా నిలబడ్డారు. నా రాజకీయ ఎదుగుదలలో ప్రతీసారి నాకు అండగా నిలబడ్డారు. 2009లో టీడీపీతో టీఆరెస్ పొత్తు పెట్టుకున్నప్పుడు పాలమూరు ప్రజలు కేసీఆర్ ను ఎంపీగా గెలిపించారు. అప్పుడు కేసీఆర్ గెలుపులో కొత్తకోట దయాకర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు” అని రేవంత్ అన్నారు


తొమ్మిదేళ్లలో పాలమూరుకు కేసీఆర్ చేసిందేం లేదని విమర్శించారు. గతంలో సీతా దయాకర్ రెడ్డి జెడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు దేవరకద్రను ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ఆ తరువాత ఆమె ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. “ఇప్పుడున్న బీఆరెస్ ఎమ్మెల్యేలు దోపిడీ దొంగలకంటే దారుణంగా తయారయ్యారు. కాంట్రాక్టులు, కమీషన్లు తప్ప ఎమ్మెల్యేకు దేవరకద్ర అభివృద్ధి పట్టడంలేదు. నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతలను పడావుపెట్టారు. అందుకే వచ్చే ఎన్నికల్లో పాలమూరు జిల్లాలో 14కు 14 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపించాలి” అని రేవంత్ రెడ్డి అన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా నేతలకు కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రాధాన్యత కల్పిస్తోందని, సీతక్కను కూడా రాజకీయంగా అన్ని రకాలుగా పార్టీ ఆదుకుంటుందని భరోసానిచ్చారు రేవంత్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ ను గద్దె దించడం ఖాయమన్నారు. “ఈ నెల 16,17,18న సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, ఇతర జాతీయ నాయకులు రాష్ట్రానికి వస్తున్నారు. ఈ నెల 17న తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరిగే విజయ భేరికి భారీగా తరలిరండి” అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మానకొండూరు బీఆరెస్ నేతలు

మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలానికి చెందిన పలువురు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు కాలువ మల్లేశం, శ్రీనివాస్ తో సహా పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో వారికి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి.

విజయభేరీ సభావేదికకు భూమిపూజ

ఈ నెల 17న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో విజయభేరి సభ నిర్వహించనున్న నేపథ్యంలో సభా వేదిక ఏర్పాటు కోసం ఇవాళ భూమిపూజ నిర్వహించారు. ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మధుయాష్కీ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గ్రౌండ్ ను సందర్శించి.. సభా వేదిక, ఇతర ఏర్పాట్లకు సంబంధించి పలు సూచనలు చేరారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments