ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుంట్ల దామోదర రెడ్డిలు తమ పదవులకు వెంటనే రాజీనామా చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర మాజీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు.
వీరు ఇద్దరు బిఆర్ఎస్ పార్టీ నుండి పదవులు పొంది, కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్నారు, ఇది న్యాయం కాదని వెంకటేశ్వర రెడ్డి అన్నారు.ఎంఎల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి స్వయంగా కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, ఎంఎల్సీ కూచుకంట్ల దామోదర రెడ్డి తన కుమారునికి కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ టికెట్ ఇప్పించి ప్రచారంలో పాల్గొంటున్నారని తెలిపారు. రాజకీయ విలువలు పాటించి తక్షణమే బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంఎల్సీ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని అన్నారు.
కూచుకుంట్ల దామోదర రెడ్డి తన కొడుకుకు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ టికెట్ వస్తే రాజీనామ చేస్తానని అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయన తన మాట నిలబెట్టుకొని తక్షణమే రాజీనామా చేయాలని సూచించారు. ఇద్దరు కూడా రాజకీయ విలువలు పాటించకుండా రాజీనామాలు చేయకుండా ఎంఎల్సీలుగా కొనసాగడం న్యాయమేనా.. అని ప్రశ్నించారు. వీరిద్దరికీ ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా.. వెంటనే ఎంఎల్సీ పదవులకు రాజీనామ చేయాలని.. నైతిక రాజకీయ నియమాలు పరిధిని దాటి కాంగ్రెస్ పార్టీ తరపున అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న మీకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఓటర్లు తగిన విధంగా గుణపాఠం చెప్తారని అన్నారు.