లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నవేళ పార్టీల మద్య విమర్శలు, ప్రతివిమర్శల దాడి పెరుగోతోంది. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ఈదశాబ్దపు అతిపెద్ద అబద్ధం అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను రద్దు చేసిందే కాంగ్రెస్ పార్టీ అని.. అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పుకు విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్లను అమలు చేస్తూ.. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో గండి కొట్టింది కాంగ్రెస్ పార్టీ అని తీవ్ర స్థాయిలో విమర్శంచారు. కాంగ్రెస్ పార్టీకి బీసీల రిజర్వేషన్ లపై బిజెపిని విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు. గత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా అధికారంలోకి రావాలని చూస్తుందని ఆరోపించారు. ఈ దేశాన్నిపాలించే హక్కు సోనియాగాంధీ కుటుంబానికి ఉందని కాంగ్రెస్ పార్టీ ఫీల్ అవుతా ఉందని.. ఈ దేశాన్ని ఏ ఇతర పార్టీలు, ఏ వ్యక్తులు పరిపాలించకూడదని కాంగ్రెస్ పార్టీ ఓ దుర్మార్గపు ఆలోచన చేస్తోందని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. దేశంలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో సానుకూలత వాతావరణం కనిపించడం లేదన్నారు. ఖచ్చితంగా బీజేపీ మెజారిటీ స్థానాలు గెల్చుకుంటుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.