విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీని స్వాగతిస్తున్నామని, అయితే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడితే మాత్రం ఊరుకునేది లేదని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. విభజన సమస్యల పరిష్కారంకు కేంద్రం సానుకూలంగా ఉందని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడితే చూస్తూ ఊరుకోని తెలిపారు.
తెలంగాణ స్పీకర్ కనబడటం లేదు..!
ఎమ్మెల్యే దానం నాగేందర్ సభ్యత్వాన్ని రద్దు చేయకపోతే ప్రజాస్వామ్యం పై ప్రజలకు నమ్మకం పోతుందని మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో పిటీషన్ తీసుకోకుండా స్పీకర్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. అసెంబ్లీ కార్యాలయానికి ఎన్నిసార్లు వెళ్లినా కనపించడం లేదన్నారు. స్పీకర్ కి రిజిస్టర్ పోస్టులో పంపిస్తే , లెటర్స్ ను మళ్ళీ తిరిగి పంపిస్తున్నారని చెప్పారు. ఈ విషయంలో ఇప్పటికే హై కోర్టులో కేసు ఉందని, అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని తెలిపారు.
ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం
రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెంది అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. సర్కార్ పెద్దలు, వివిధ ట్యాక్సుల పేరుతో అవినీతికి పాల్పడితే వాస్తవాలతో సహా బయపెట్టామని తెలిపారు. ముఖ్యంగా సివిల్ సఫ్లయ్ శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై కేంద్రానికి నివేదిక ఇచ్చామని, త్వరలోనే విచారణ జరుగుతుందని తెలిపారు.
ఓటమి భయంతోనే..
ఓటమి భయంతోనే కాంగ్రెస్ సర్కార్… పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు వెనకాడుతోందని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇన్ని రోజులు పంచాయతీల్లో స్పెషలాఫీసర్ల పాలన ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి తమది ప్రజాపాలన అని చెప్పుకోవడానికి సిగ్గుండాలని ఎద్దేవా చేశారు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ప్రతీకలైన పంచాయతీలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీలకు ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర ఆర్థిక సంఘం SFC – State Finance Commission నిధులు దాదాపు రూ. 2 వేల కోట్ల విడుదల కావడంలేదన్నారు. పంచాయతీ వ్యవస్ధలో ఎన్నికైన స్ధానిక ప్రజా ప్రతినిధులు ఉంటేనే కేంద్రం నుంచి నిధులు వస్తాయని గుర్తు చేశారు. పాలవర్గాలు లేకపోవడంతో గ్రామపంచాయతీల్లో నిధులు లేక పల్లెలు కూనరిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు సర్పంచులు అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు కొనసాగిస్తే…ఆరు నెలల నుంచి ప్రత్యేక అధికారులు అప్పులు చేసి పల్లెల్లో అభివృద్ధి పనులు చేస్తున్నారని తెలిపారు.
ఏడు నెలల నుంచి పంచాయతీ సిబ్బందికి వేతనాలు లేవు
ప్రజా పాలన అని గొప్పులు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పాలనలోనే ఏడు నెలలుగా పంచాయతీలకు నిధుల్లేవు. పంచాయతీ సిబ్బందికి వేతనాలు లేవని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. గత్యంతరం లేక వారు కుటుంబ జీవనం కోసం కూలీ పనులకు వెళ్తున్నారని చెప్పారు.దీంతో గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందన్నారు. కనీసం చెత్తను ఎత్తేసేందుకు దిక్కులేదని తెలిపారు. కాని కాంగ్రెస్ నేతలు మాత్రం మీడియాలో ప్రజా పాలన అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని మొత్తం 12,769 గ్రామ పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. కమీషన్ల కోసం గత ప్రభుత్వం సర్పంచ్ లతో బలవంతంగా ట్రాక్టర్లు కొనుగోలు చేయించిందని, ఇప్పుడు వాటి ఈఎంఐలు కట్టేందుకు కూడా ఎవరు దిక్కులేరన్నారు.
అవుట్ సోర్సింగ్, గ్రామ కార్యదర్శులకయితే ఆరు నెలల నుంచి వేతనాలు లేవు
రాష్ట్రంలో ప్రస్తుతం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య దాదాపు రెండు వేల వరకు ఉంటుందని అంచనా. అవుట్ సోర్సింగ్ గ్రామ కార్యదర్శులే కాదు, రెవెన్యూ, విద్యా శాఖ వంటి ఇతర విభాగాల్లో కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రత్యేకించి కంప్యూటర్ ఆపరేటర్లకు కూడా నాలుగు నెలల నుంచి వేతనాలు ఇవ్వలేదంటున్నారు. పదవీ కాలం పూర్తి చేసుకున్న మాజీ సర్పంచులు, ఎంపీటీసీ, జడ్ పిటీసీ సభ్యులకు ఆరు నెలల గౌరవ వేతనం పెండింగులో ఉందని వాపోతున్నారు.
బీ ట్యాక్స్ ఇస్తాలేరని సర్పంచ్ల బిల్లులు ఆపుతున్నారా?: ఏలేటి
“గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పారని, వర్క్ ఆర్డర్ తో సర్పంచులు సొంతంగా లక్షల రూపాయలు అప్పులు చేసి గ్రామాల్లో పనులు చేయించారు.. వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు తదితర పనులు చేపట్టారు. కానీ, కేసిఆర్ సర్కారు ఆపనులకు సంబంధించిన నిధులు విడుదల చేయలేదు. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో పలు సందర్భాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వం రూ.3 లక్షల నుంచి రూ.కోటి వరకు బకాయి ఉన్నట్లు సర్పంచులు చెబుతున్నారు. ఈ లెక్కన రాష్ట్రం మొత్తమ్మీద రూ.1000 కోట్లకు పైగా బిల్లుల బకాయి ఉన్నట్లు సమాచారం.అసెంబ్లీకి ఎన్నికలు జరిగి బీఆర్ఎస్ సర్కారు పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సర్పంచుల పదవీకాలం ముగిసి ఐదు నెలలైంది. అయినా మాజీ సర్పుంచులు చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఇంకా విడుదల కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పది శాతం కమిషన్లు ఇస్తే తప్ప ఆర్ధిక శాఖ బిల్లులు ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. బహుశా ఈ మాజీ సర్పుంచులు పది శాతం కమిషన్లు ఇచ్చుకోలేకపోవడం వల్లే బిల్లులు విడుదల కావడం లేదేమో అనే అనుమానాలున్నాయి. వెయ్యి కోట్లకు పైగా ఉన్న పెండింగు బిల్లులను క్లియర్ చేసేందుకు పది శాతం కమిషన్ అంటే వంద కోట్లు ముడుపులు చెల్లించాలేమో” అని అన్నారు.
ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ల మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల మీద లేదు
సర్కార్ పెద్దలకు ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ల మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల మీద లేదని మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్లకు, మంత్రుల కంపెనీలకు వందల కోట్లు ఇవ్వడానికి నిధులు ఉంటాయి తప్పితే కనీసం పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడానికి చేతులు రావడం లేదని దుయ్యబట్టారు. నాలుగు వేలకు పెంచుతామన్న పింఛన్ల సంగతీ ఏమోగాని కనీసం ఇప్పుడిస్తున్న 2వేల పింఛన్ కూడా రెండు నెలలు ఆలస్యంగా ఎందుకు ఇస్తున్నారో చెప్పాలన్నారు. అలాగే మధ్యాహ్న భోజనం కార్మికులకు కూడా ఏడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
పింఛన్లు కూడా ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ?
నిజంగా కనీస సంక్షేమ కార్యక్రమాలకు కూడా నిధులు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. అలా అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తప్పకపోతే ఆర్థిక పరిస్థితుల మీద ఎమర్జెన్సీ పెట్టాలన్నారు. నిధులు లేక గ్రామ పంచాయతీలు విలవిలలాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలన అని చెప్పడం కాదు, పల్లె బాట పట్టాలని మంత్రులకు హితవు పలికారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.