నేటి నుండి తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ సమావేశాలు వాడీ వేడీగా జరిగే అవకాశం ఉంది. ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వకుండా.. సమావేశాలలో వివిధ అంశాలలో ప్రతిపక్ష పార్టీలను ఎండగట్టడం కోసం అధికార పక్షం సన్నద్ధం అవుతోంది. మరోవైపు గవర్నర్‌కు ప్రభుత్వానికి మధ్య సయోధ్య లేకపోవడంతో గతంలో కొన్ని బిల్లులను గవర్నర్ తిప్పి పంపిన విషయంలో బిజెపిని కేంద్రంగా చేసుకొని తీవ్రస్థాయిలో విరుచుకు పడటం కోసం బిఆర్‌ఎస్ సిద్ధం అవుతోంది. అదే విధంగా ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరును కూడా సీఎం కెసిఆర్ ఈ సభ ద్వారా ప్రజలకు వివరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇవే చివరికి సమావేశాలు అయ్యే అవకాశం ఉంది. ఈ సభ లోనే ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఆమోదించబోతోంది.
ఆర్‌టిసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తిస్తూ సభలో బిల్లు ప్రవేశ పెట్టనున్నారు. ఈ రోజు అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత నిర్వహించే బిఎసి మీటింగ్ లో సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. సెప్టెంబర్ నెలలోనే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఈ సమావేశాలలోనే ప్రభుత్వం పలు కీలకమైన ప్రకటనలు చేసే అవకాశం లేకపోలేదు. ఈ ఏడాదికి సంబంధించి ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు కావటంతో అన్ని వర్గాలలో సమావేశాలపై ఆసక్తి నెలకొంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఏమైనా ముఖ్యమైన ప్రకటనలు చేస్తుందా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. మరోవైపు ప్రతిపక్షాలు అస్త్ర శాస్త్రాలలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్నాయి.