తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండి పోతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి పోయాయి. నల్లగొండ జిల్లా మాడ్గుల పల్లి, మంచిర్యాల జిల్లా హాజిపూర్‌లో అత్యధికంగా 45.2 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా ఇదే ఉష్ణోగ్రత అత్యధికం.. 27 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైనే నమోదయ్యాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా రికార్డవుతున్న నేపథ్యంలో రాష్ట్రం మొత్తానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది.
రాష్ట్రంలో పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశముంది. ఆ జాబితాలో కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలున్నాయి. నిన్న రాత్రి 10:30 గంటల వరకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ధర్మా సాగర్‌లో అత్యధికంగా 4.25 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడా వర్షం కురిసింది.
మొత్తం మీద రాష్ట్రంలో 30 ప్రాంతాలలో వర్షపాతం నమోదైంది. వచ్చే ఒకటెండ్రు రోజులు పలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.