తొమ్మిదిన్నర నెలలుగా అసమర్థుడి జీవయాత్రలాగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం కొనసాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, రెండు లక్షలు రుణమాఫీ అని చెప్పి, రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి మోసం చేసిండని అన్నారు. ముఖ్యమంత్రే స్వయంగ ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి, వారి కాళ్లు పట్టుకొని మరీ కండువాలు కప్పుతున్నాడని విమర్శించారు. పది మంది ఎమ్మెల్యేలు వచ్చారని.. ఇంకా వస్తారని కాంగ్రెస్ మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకు మాట్లాడుకుంటున్నారని అన్నారు. కానీ అది జరగదని అన్నారు. ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్ లో భయం మొదలైందని అన్నారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపడని.. చావు డప్పులు కొట్టండని మాట్లాడిందే రేవంత్ రెడ్డి అని గుర్తు చేశారు. హైకోర్టు తీర్పు వచ్చిన రోజే అరికెపుడి గాంధీని పీఏసీ చైర్మన్ (PAC Chairman)గా నియమిస్తూ ప్రకటన చేశారని అన్నారు. ప్రజాస్వామ్య విలువలు తుంగలో తొక్కుతూ పీఏసీ చైర్మన్ గా ఎలా చేస్తారని మేము ప్రశ్నిస్తే పోలీసుల అండతో ఎమ్మెల్యే ఇంటి మీద దాడికి దిగారని దుయ్యబట్టారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని.. రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులను చాలామందిని చూశామని తెలిపారు. హైదరాబాద్ లో పదేళ్లలో శాంతి భద్రతలు అద్భుతంగా మెయింటైన్ చేసామని అన్నారు.హైదరాబాద్ లో ఉన్న ప్రజలు అందరు మావారే అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ ప్రజలు అండగా నిలిచారని రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.